
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ రాళ్లగూడ సమీపంలోని దొడ్డి ఇంద్రారెడ్డి కాలనీలో హృదయ విదారక ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఇంటి దగ్గర సిమెంట్ లోడ్ దింపేందుకు అశోక్ లే లాండ్ మినీ ట్రక్ అక్కడకు వెళ్లింది. సిమెంట్ దింపేసి తిరిగి వెళుతున్న సమయంలో ఆడుకుంటున్న ఒకటిన్నర సంవత్సరాల కీర్తి అనే చిన్నారి పైకి మినీ ట్రక్ ముందు టైరు అదుపు తప్పి ఎక్కింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే చిన్నారి కీర్తి ప్రాణాలు కోల్పోయింది.
అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు.. అప్పటిదాకా ఆడుకుంటూ కనిపించిన బంగారు తల్లి అకాల మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆ హృదయ విదారక దృశ్యం చూసిన స్థానికులు చలించిపోయారు. స్థానికులు కూడా శోక సంద్రంలో మునిగి పోయారు. ఆటో డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పాప మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.