
సూర్యాపేట జిల్లా: సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతగిరి మండలం శాంతినగర్ పరిధిలో హైవేపై మొక్కలకు నీళ్లు కొడుతున్న నీళ్ల ట్యాంకర్ లారీని ఇన్నోవా కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరిగ్గా రెండు రోజుల క్రితమే.. ఆటోను ఓవర్టేక్చేయబోయిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద చోటుచేసుకున్నది. దంపతులు, ఎనిమిదేండ్ల కుమార్తె ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను గడ్డం రవీందర్, రేణుక, రితికగా గుర్తించారు. తొర్రూరు మండలం కాంటెయ్యపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34) హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆదివారం ఆత్మకూరు (ఎస్) మండలం కోట పహాడ్ గ్రామంలో బంధువుల ఇంట్లో ఉప్పలమ్మ పండుగకు హాజరై, హైదరాబాద్ వెళ్తున్నాడు.
ALSO READ | బైక్ రేసర్ పొగరు.. హైదరాబాద్ నడిరోడ్డుపైనే కానిస్టేబుల్ను బీర్ సీసాతో కొట్టాడు
బీబీగూడెం గ్రామ శివారులో.. ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఓవర్ టెక్ చేయబోయి ఇతడి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో రవీందర్, భార్య రేణుక (28), కూతురు రిషిత(8) అక్కడికక్కడే మృతి చెందారు. రిషి కృష్ణ(5) పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు పిల్లలకు గాయాలవ్వడంతో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కారులో మొత్తం 11 మంది ఉండగా.. వీరిలో రవీందర్, అతడి భార్య, బామ్మర్ది, వదినతో పాటు ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ కె. నరసింహ పరిశీలించారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రవి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేశ్వర్, ఆర్టీసీ డిపో మేనేజర్ ఉన్నారు. అయితే, ప్రమాదానికి ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని డీఎస్పీ రవి మీడియాకు తెలిపారు.