![‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ ట్రైలర్ రిలీజ్](https://static.v6velugu.com/uploads/2022/10/Trailer-of-Aishwarya-Rajesh-The-Great-Indian-Kitchen_qAfKUmsxPb.jpg)
సంవత్సరానికి కనీసం మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తుంది ఐశ్వర్యా రాజేష్. ఈ యేడు మాత్రం ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అవకాశాలు లేక కాదు. ఒకేసారి చాలా సినిమాలు చేస్తుండటం వల్ల. ప్రస్తుతం పదికి పైనే సినిమాలు చేస్తోందామె. వాటిలో చాలావరకు షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. వీటిలో రెండు చిత్రాల నుంచి అప్‌డేట్స్ రిలీజయ్యాయి. కిన్‌స్లిన్ దర్శకత్వంలో ఐశ్వర్య నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ‘డ్రైవర్ జమున’ని నవంబర్ 11న విడుదల చేయనున్నట్టు ఆ టీమ్ ప్రకటించింది. ఇక ఆర్.కణ్నన్ డైరెక్షన్‌లో ఐశ్వర్య నటిస్తున్న ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ ట్రైలర్ కూడా రిలీజయ్యింది. మలయాళంలో సేమ్ టైటిల్‌తో జో బేబీ తీసిన చిత్రానికి రీమేక్ ఇది.
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టిన ఓ అమ్మాయి కథ. భర్తకి, అతని కుటుంబానికి సేవ చేయడమే ఆమె జీవితం అయిపోతుంది. మంచి డ్యాన్సర్ అయ్యుండి కూడా మనసు చంపేసుకుని వంటింటికే పరిమితమైపోతుంది. కష్టాన్నంతటినీ కడుపులోనే దాచుకుని బతకాలని ప్రయత్నిస్తుంది. కానీ ఓ సమయంలో ఆమె ఓర్పు నశించిపోతుంది. ఆ వంటగది నుంచి బైటపడి స్వేచ్ఛగా ఎగరాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడామె ఏం చేసింది, అనుకున్నది ఎలా సాధించింది అనేది మిగతా కథ. మలయాళంలో నిమిషా సజయన్ అద్భుతంగా నటించి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. అదే పాత్రని తమిళంలో ఐశ్వర్య చేస్తోంది. ఆమె భర్తగా రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నాడు. ఐశ్వర్య ఎంత మంచి నటో, ఇలాంటి పాత్రలకి ఎలా ప్రాణం పోస్తుందో అందరికీ తెలిసిందే. మరోసారి ఆమె తన నట విశ్వరూపాన్ని చూపించబోతోందని ఈ ట్రైలర్ హింట్ ఇచ్చింది.