మహబూబాబాద్ జిల్లాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

హైదరాబాద్: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. డోర్నకల్ రైల్వే జంక్షన్ సమీపంలోని ఖమ్మం భద్రాచలం బైపాస్‎లో ప్రమాదవశాత్తూ గూడ్స్ పట్టాలు తప్పడంతో బోగీలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని బోగీలు పట్టాల నుండి పక్కకు ఒరిగాయి. ప్రమాదానికి గురి అయిన గూడ్స్ రైలు బొగ్గు లోడు కోసం భద్రాచలం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ పట్టాలు తప్పిన విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. 

ఘటన స్థలంలో రైల్వే అధికారులు, సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ట్రాక్ మీద అడ్డంగా ఉన్న బోగీలను పక్కకు తొలగించారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. గూడ్స్ పట్టాలు తప్పడంతో ఈ రూట్‎లో  రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.