మునుపెన్నడూ లేని విధంగా భారత రైల్వే వ్యవస్థ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తుంది. స్వదేశీ గడ్డ మీద తయారైన వందేభారత్ రైళ్లను పట్టాల మీద పరుగులు పెట్టించడం డెబ్భై ఐదేళ్ల స్వాతంత్ర భారతానికి గర్వకారణం. భారత రైల్వే వ్యవస్థని స్పృశించకుండా ఆధునిక భారత దేశ చరిత్రని సంపూర్తిగా తెలుసుకోలేము. సామాన్యుడి రథంగా ముద్ర పడిన రైలు బండి సంస్కరణ దిశగా పయనిస్తున్నప్పటికీ అది సామాన్యుడికి అందనంత దూరంగా వెళ్తుంది అన్నది నేటి చేదు వాస్తవం. బ్రిటిష్ వారి దోపిడీ కార్యక్రమం కోసం రైళ్లను ఆరంభించినప్పటికీ కాలక్రమేణ స్వాతంత్ర భారత సామాన్యుడి జీవనానికి ఊతంగా నిలిచింది.
నామమాత్రపు రుసుములతో సుదూరపు ప్రయాణాలు సైతం రైలు ద్వారా సులభమైంది. నేడు రోడ్లపై ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. నెత్తురోడుతున్న రోడ్లు వాహన చోదకుల్లో తీవ్ర భయాందోళనలు రేకిత్తిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలో జరిగే 10 రోడ్డు ప్రమాదాల్లో ఒకటి మన దేశంలో జరుగుతుంది అంటే రోడ్డు భద్రత ఎంత దీన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సంక్లిష్ట స్థితిలో రైల్వే వ్యవస్థ సురక్షిత ప్రయాణానికి ఊతంగా నిలిచింది. ఒకవైపు వందే భారత్ రైళ్లు పట్టాల మీద పరుగులు పెడుతుంటే మరోవైపు భారత రైల్వే వ్యవస్థ లాభాల్లో అదే జోరు చూపిస్తుంది.
ఇటీవల రైల్వేశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రైల్వే 2.40 లక్షల కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. ఇది రైల్వే శాఖ ఎదుగుదల సూచిస్తున్నప్పటికి ప్యాసింజర్ రైళ్లు, సిబ్బంది నియామక ప్రక్రియ తదితర విషయాల్లో మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. సామాన్య ప్రయాణికులకు ఆసరాగా నిలిచిన ప్యాసింజర్ రైళ్లు నేడు కనుమరుగయ్యాయి. వాటిని సామాన్యులకు తిరిగి అందుబాటులోకి తేవాలి.
- జి.వి.సాయికుమార్ గుంత