రైల్వే విద్యుత్​ ఇంజిన్లకు నూరేండ్లు

రైల్వే విద్యుత్​ ఇంజిన్లకు నూరేండ్లు

భారతీయ రైల్వేలో  విద్యుత్తు ఇంజిన్ల శకం ప్రారంభమై నూరేళ్లు నిండాయి. 1925 ఫిబ్రవరిలో తొలి విద్యుత్తు ఇంజిన్ రైలు బొంబాయి వీటీ స్టేష‌‌‌‌న్ నుంచి కుర్లా హార్బర్​ (16 కి.మీ.) వ‌‌‌‌ర‌‌‌‌కు  ప్రయాణించింది. ఇది దేశంలో విద్యుత్తు  రైళ్లు న‌‌‌‌డ‌‌‌‌ప‌‌‌‌డానికి ప‌‌‌‌డిన తొలి అడుగు.  అయితే, ఆనాటి నుంచి నేటివ‌‌‌‌ర‌‌‌‌కు  రైల్వే విద్యుద్దీక‌‌‌‌ర‌‌‌‌ణ బాగా ఆల‌‌‌‌స్యంగా జ‌‌‌‌రిగింద‌‌‌‌న‌‌‌‌డంలో ఎలాంటి సందేహంలేదు. 

ఒక‌‌‌‌ప్పుడు బొగ్గు(స్టీమ్‌‌‌‌)తో న‌‌‌‌డిచే ఇంజిన్లవ‌‌‌‌ల్ల భారీగా న‌‌‌‌ల్లటి పొగ వాతావ‌‌‌‌ర‌‌‌‌ణంలో  ప్రవేశించేది.  రైల్వేలైను ప‌‌‌‌రిస‌‌‌‌ర ప్రాంతాలలో బొగ్గు కాలిన వాస‌‌‌‌న వ‌‌‌‌చ్చేది. కాలుష్య తీవ్రత కూడా ఎక్కువ‌‌‌‌గా ఉండేది.  పైగా ఈ ఇంజిన్లను న‌‌‌‌డిపే డ్రైవ‌‌‌‌ర్లకు పని క‌‌‌‌త్తిమీద సాములా ఉండేది. ఇంజిన్‌‌‌‌లో భాగంగా ఒక చిన్నపాటి వ్యాగ‌‌‌‌న్ బొగ్గుతో నిండి ఉండేది.  

దానిలోంచి బొగ్గును తోడి కుంప‌‌‌‌టి (బ‌‌‌‌ర్నర్‌‌‌‌)ను తెరిచి అందులో వేసేవారు. ఈ బొగ్గు కుంప‌‌‌‌టిలో వ‌‌‌‌చ్చే వేడితో  పక్కనే ఉండే నీరు ఆవిరిగా మారి ఇంజిన్ న‌‌‌‌డిచేందుకు దోహ‌‌‌‌ద‌‌‌‌ప‌‌‌‌డేది. ఆ భ‌‌‌‌గ‌‌‌‌భ‌‌‌‌గ మండే కుంప‌‌‌‌టి తెరిచిన‌‌‌‌ప్పుడు డ్రైవ‌‌‌‌ర్లకు తీవ్రమైన వేడి త‌‌‌‌గిలేది. దీనివ‌‌‌‌ల్ల  ఇంజిన్ మొత్తం భ‌‌‌‌రించ‌‌‌‌లేని వేడిగా ఉండేది. ఎండాకాలంలో  డ్రైవ‌‌‌‌ర్ల అవ‌‌‌‌స్థ చెప్పన‌‌‌‌ల‌‌‌‌వికాదు.  1853 నుంచి నిరంత‌‌‌‌రాయంగా 140 ఏళ్లు న‌‌‌‌డిచిన స్టీమ్ ఇంజిన్లు 1993లో  పూర్తిగా సేవ‌‌‌‌ల‌‌‌‌ నుంచి నిష్క్రమించాయి.

ఇక రైల్వేలో 1954లో  ప్రవేశించిన డీజిల్ ఇంజిన్లు 70 ఏళ్లపాటు సేవ‌‌‌‌లందించి ఈ ఏడాదిలో సెల‌‌‌‌వు తీసుకోనున్నాయి. ఇప్పటికే భారతీయ రైల్వే  విద్యుదీకరణ దేశంలోని అన్ని  మార్గాల్లో 97 శాతం పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించింది. మరో మూడు శాతం ఇంకొన్ని నెలల్లో పూర్తి కావచ్చని తెలుస్తున్నది. 

ఇలా వందేళ్లకయినా దేశంలో నూరుశాతం విద్యుద్దీకరణ పూర్తవుతుండడం  హర్షణీయం.  సంపూర్ణ విద్యుద్దీక‌‌‌‌ర‌‌‌‌ణ జ‌‌‌‌రిగినా.. అత్యవసర పరిస్థితుల్లో, ప్రత్యామ్నాయ అవసరాల కోసం మ‌‌‌‌రికొన్నేళ్లపాటు చాలా త‌‌‌‌క్కువ సంఖ్యలో డీజిల్ ఇంజిన్లు కొన‌‌‌‌సాగుతాయ‌‌‌‌ని రైల్వే వ‌‌‌‌ర్గాలు చెబుతున్నాయి.  కొన్నేళ్లుగా డీజిల్ ఇంజిన్లు రైల్వేలో ఎక్కువ శాతం మార్గాల్లో సేవ‌‌‌‌లందిస్తూ వ‌‌‌‌చ్చాయి. 

ప్రధాని ఇందిర ఆదేశంతో..

1980లో నాటి  ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కార్యాల‌‌‌‌యం నుంచి విద్యుద్దీక‌‌‌‌ర‌‌‌‌ణ వేగం పెంచాల‌‌‌‌ని ఆదేశాలు అంద‌‌‌‌డంతో కొంత క‌‌‌‌ద‌‌‌‌లిక పెరిగింది. అయిన‌‌‌‌ప్పటికీ 44 ఏళ్లు గ‌‌‌‌డ‌‌‌‌చినా సంపూర్ణ విద్యుద్దీక‌‌‌‌ర‌‌‌‌ణ ల‌‌‌‌క్ష్యం నెర‌‌‌‌వేర‌‌‌‌లేదు. దీనికి కార‌‌‌‌ణాలు అనేకం కావ‌‌‌‌చ్చు.  ప్రభుత్వాలు మార‌‌‌‌డం, రాజకీయ ప్రాధాన్యాలు కొత్తగా చేర‌‌‌‌డం రైల్వేశాఖ‌‌‌‌లో ప‌‌‌‌రిపాటిగా మారింది. 

అయితే, 2030 నాటికి రైల్వేలో జీరో కార్బన్​ ఎమిష‌‌‌‌న్ అంటే ఎలాంటి కాలుష్యం రాని విధంగా రైళ్లు న‌‌‌‌డ‌‌‌‌పాల‌‌‌‌న్నది  ల‌‌‌‌క్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. దీంతోపాటే  విద్యుత్తు రైలు ప్రారంభ‌‌‌‌మై వందేళ్లు పూర్తయ్యే నాటికి నూరు శాతం విద్యుద్దీక‌‌‌‌ర‌‌‌‌ణ పూర్తి చేయాల‌‌‌‌ని కూడా ఒక సంక‌‌‌‌ల్పం పెట్టుకొని ఆ  దిశగా ప్రభుత్వరంగ సంస్థలకే  విద్యుద్దీకరణ కాంట్రాక్టులు ఇచ్చింది.  దేశంలో ప్రస్తుతం  బ్రాడ్‌‌‌‌గేజ్ నెట్‌‌‌‌వ‌‌‌‌ర్క్ 66,724 కి.మీ. రూట్ సంపూర్ణంగా విద్యుద్దీకరణ లక్ష్యానికి చేరువవుతున్నది.

విద్యుద్దీక‌‌‌‌ర‌‌‌‌ణ వ‌‌‌‌ల్ల లాభాలు

రైల్వే లైన్ల విద్యుద్దీక‌‌‌‌ర‌‌‌‌ణ వ‌‌‌‌ల్ల ఇంజిన్ల నుంచి కాలుష్యం వెలువ‌‌‌‌డ‌‌‌‌దు. డీజిల్ ఇంజిన్ల నుంచి ఎక్కువగా కర్బన ఉద్గారాలు విడుద‌‌‌‌లవుతాయి. కానీ, విద్యుత్తు ఇంజిన్లవ‌‌‌‌ల్ల ఎలాంటి కాలుష్యం లేనందున ప‌‌‌‌ర్యావ‌‌‌‌ర‌‌‌‌ణానికి మేలు జ‌‌‌‌రుగుతుంది.  డీజిల్ ఇంజిన్ల నుంచి వచ్చే శబ్దంకన్నా  విద్యుత్తు ఇంజిన్ల శబ్దం చాలా తక్కువగా ఉంటుంది.  

ప్రయాణ సమయంలో ప్రయాణికుల బోగీ ఎక్కువగా ఊగదు. ఇక నిర్వహణపరమైన వ్యయం కూడా బాగా త‌‌‌‌గ్గుతుంది. భారీ స‌‌‌‌ర‌‌‌‌కు ర‌‌‌‌వాణా రైళ్లు, దూర‌‌‌‌ప్రాంత ప్రయాణికుల  రైళ్లకు  చేర‌‌‌‌వేత‌‌‌‌లో ఇబ్బందులు దూర‌‌‌‌మ‌‌‌‌వుతాయి.  డీజిల్ ఇంజిన్ల కోసం విదేశాల నుంచి  చ‌‌‌‌మురు దిగుమ‌‌‌‌తి త‌‌‌‌గ్గి విదేశీ మార‌‌‌‌క ద్రవ్యం ఆదా అవుతుంది. ఇలా ఏటా రూ.15 వేల కోట్లకు పైగానే విదేశీ మార‌‌‌‌క ద్రవ్యం ఆదా అవుతుంద‌‌‌‌ని అంచ‌‌‌‌నా.  

పదేళ్లలో  లక్షన్నర కోట్లు  ప్రభుత్వ ఖజానాకు పొదుపు చేయవచ్చు.  రైల్వేలో విద్యుద్దీకరణ  సంపూర్ణమవడంతో ఇన్నాళ్లపాటు పర్యవేక్షణ ఏర్పాట్లు చూసిన కోర్ సంస్థ రద్దు కానున్నది.  దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల రైలు మార్గాలను దశలవారీగా విద్యుద్దీకరించేందుకు ప్రత్యేకంగా 1979లో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ -కోర్ సంస్థకు ఇక విద్యుద్దీకరణను చేసేందుకు పని లేకుండా పోయింది. 

దీంతో ఈ సంస్థ రద్దు చేసి, ఉద్యోగులను రైల్వేలోనే విద్యుద్దీకరణ విభాగంగా సర్దుబాటు చేయనున్నారు.  కొత్తగా నిర్మించే  రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయిన తరువాత ఈవిభాగం ఉద్యోగులు అక్కడ విద్యుద్దీకరణ కోసం విద్యుత్తు లైన్లు నిర్మించే బాధ్యతను నిర్వర్తించనున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నవిద్యుత్తు లైన్ల పర్యవేక్షణ, మరమ్మతులు, అత్యవసర పనులువంటి బాధ్యతలు వీరికి అప్పగించనున్నారు.

డీజిల్ ఇంజిన్ల విక్రయం

ఇక ఇన్నాళ్లూ సేవలందించి విద్యుద్దీకరణ కారణంగా నిష్క్రమించనున్న 4,543 డీజిల్ ఇంజిన్లను మన రైల్వేశాఖ ఆఫ్రికా దేశాలకు విక్రయించనున్నది. ఆయా దేశాల్లో ఉన్న గేజ్​కు అనుగుణంగా (అక్కడ ఉన్న కేప్ గేజ్​కు మార్చి) వీటిని విక్రయించాలని ప్రయత్నాలు చేస్తున్నది. 

ఇప్పటికే ఒక దానికి రూ.35 కోట్లు,  మరో దానికి రూ.50 కోట్లకు ఆర్డర్ వచ్చినట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. వీటి జీవితకాలం ఇంకా 10 నుంచి 15 ఏండ్లు ఉన్నందున విక్రయించడం మినహా గత్యంతరం లేదు.  ఇలాంటి వాటిని ఆఫ్రికా దేశాలు కోరుతుండడం కూడా రైల్వేకు కలిసివచ్చే అంశం.

- కె. బాలకిషన్ రావు, సీనియర్ జర్నలిస్ట్-