
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఓ ట్రెయిన్ రెండు భాగాలుగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఢిల్లీ నుంచి ఒడిశాలోని పూరీకి వెళ్లే నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం చందౌలిలోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ(డీడీయూ) జంక్షన్ సమీపంలోకి రాగానే.. వ్యాగన్‌లను అటాచ్ చేసే కప్లింగ్ చైన్, హుక్ విరిగిపోయాయి.
దీంతో ట్రెయిన్ రెండు భాగాలుగా విడిపోయింది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రైల్వే అధికారులు స్పాట్‌కు చేరుకొని ఎస్4, ఎస్ 5 కోచ్‌లను డీడీయూ జంక్షన్‌కు తీసుకువచ్చి.. ప్రయాణికులను మరో కోచ్‌కు తరలించారు.
అదృష్టవశాత్తూ రైలు వేగం నెమ్మదిగా ఉండడంతో ఎవరికీ గాయాలు కాలేదని ఓ ప్రయాణికుడు చెప్పాడు. నాలుగు గంటల తర్వాత అధికారులు సమస్యను పరిష్కరించారు.