సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. జోన్ పరిధిలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ లోని టికెట్ కౌంటర్ వద్ద డిజిటల్ పేమెంట్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి రైల్వే ప్యాసింజర్లు తమ టిక్కెట్ల కొనుగోలుకు పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్), యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. జోన్లోని అన్ని ముఖ్యమైన నాన్-సబర్బన్ స్టేషన్లు , సబ్-అర్బన్ కేటగిరీ స్టేషన్లలోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) , అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) కౌంటర్లలో పీఓఎస్( 466 పీఓఎస్ మిషన్లు), యూపీఐ చెల్లింపులకు ఏర్పాటు చేశారు.
రైల్వేలో డిజిటల్ సదుపాయాల్ని బలోపేతం చేయడానికే టికెట్ కొనుగోలులో నగదు రహిత విధానాల్ని ప్రవేశపెట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ విధానం వల్ల రైల్వే ప్యాసింజర్ల సమయం ఆదా కానుందని చెప్పారు. చిల్లర కష్టాలు తీరడమే కాకుండా ప్యాసింజర్ల సంఖ్య కూడా పెరగనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జనం యూపీఐ పేమెంట్స్ కోసం గూగుల్ పే, ఫోన్ పే సహా పేటీఎం లాంటి డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్స్ తరుచుగా వాడుతున్నారు. తాజాగా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ హెల్ప్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ALSO READ: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: మంత్రి దామోదర