రైలు ప్రయాణమా.. జర భద్రం! జాతర అయినా కుంభమేళా అయినా బలి అయ్యేది పేదోడే..

రైలు ప్రయాణమా.. జర భద్రం! జాతర అయినా కుంభమేళా అయినా బలి అయ్యేది పేదోడే..

మన దేశంలో  రైలు ప్రయాణమా.. జర భద్రం కొడుకో అనే పరిస్థితి ఏర్పడింది.  సామాన్యుడి  రైలు కష్టాలు ఎన్నటికీ  తీరనివే.  తీర్చే ఆలోచన పాలకులకు వచ్చేటట్టు లేదు. పేదోడి  రైలు ప్రయాణం అంటేనే ఎప్పుడు  ఏ ప్రమాదానికి దారి తీస్తుందో  అంతుచిక్కని పరిస్థితి.  జాతరకు పోయినా,  కుంభ మేళాకు వెళ్ళినా అక్కడ జరగరానిది ఏం జరిగినా ముందు బలి అయ్యేది పేదోడే.  

ప్రమాదకర సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కొవిడ్ సందర్భంగా కూడా ఎన్నో దుర్ఘటనలు చూశాం.  రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారిని చూశాం.  ప్రభుత్వం  ప్రమాదాల నివారణ బాధ్యత  తీసుకోదు. పేదోడి  రైలు డబ్బాలు మారవు, వాటిలోని సౌకర్యాలు మారవు.  గంటల తరబడి ట్రైన్స్ ఆలస్యంగా నడుస్తాయి.  రైల్వే స్టేషన్లలో  కిక్కిరిసి పోయి నిద్ర, ఆహారాలు మాని ప్రయాణం కోసం సామాన్యులు  వేచి ఉండడం తప్పడం లేదు.   75 ఏండ్ల  స్వాతంత్ర్య  భారతదేశంలో  కూడా ఇంకా ఎదురు చూడడం ఆగలేదు.

పేదోడి కష్టాలు తీరలేదు.  పేదలు,  మధ్యతరగతి  కుటుంబాలకు  ప్రయాణాలలో అవే కష్టాలు.  కుంభమేళా ప్రయాణ కష్టాలు మరింత పెరిగిపోయాయి.  రైల్వే అధికారులు,  మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట  ఇటీవల ఢిల్లీలో సంఘటనగా చెప్పవచ్చు. ఢిల్లీ నుంచి ప్రయాగ్​రాజ్​కు వెళ్ళే  రైళ్లు మారిన సమాచారం రాగానే  హడావుడిలో ప్రయాణికులు కింద పడిపోయారు.  తొక్కిసలాట జరిగింది. ఇందులో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గరీబ్ కా మౌత్ కా సఫర్ అయిపోయింది.  పేదోడి ప్రయాణం చావుగా మారిపోయింది.

నైతిక బాధ్యత వహించాలి

ఒడిశాలో జరిగిన ఘోర రైల్వే ప్రమాదం, భారీగా మరణాలు సంభవించినపుడు,  మొన్నటి కుంభమేళాలో 30 మంది మరణించిన తర్వాత కూడా ముందు సమాచారం దాటేయడం, ఆ తర్వాత అంగీకరించడం, అసలు నైతిక విలువలను పాటించకపోవడం కామన్ అయిపోయింది.  పుల్వామా సంఘటనను వాడుకుని 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందింది.  నలుగురు రైతులు, ఒక జర్నలిస్టును తన వాహనంతో తొక్కి చంపిన అప్పటి హోం సహాయ మంత్రి  అజయ్ మిశ్రాను  కనీసం రాజీనామా చేయించకుండా..  మరోసారి పోటీకి బీజేపీ టిక్కెట్ కూడా ఇచ్చారు.  

అంతర్జాతీయ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ మీద చర్యలు లేవు.  ఆరోపణలు ఎదుర్కొన్న తండ్రికి కాకుండా కొడుక్కు టికెట్ ఇచ్చారు. అసలు నైతిక విలువలు లేవు,  బాధ్యతలు లేవు.  గతంలో మన లాల్ బహదూర్ శాస్త్రిలాంటి వాళ్ళు, చివరికి నితీష్ కుమార్ సైతం రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యతలు వహిస్తూ రాజీనామా చేసిన దాఖలాలు ఉన్నాయి.  

ఇప్పడు ఆ పరిస్థితి లేదు.  రిజర్వేషన్ ఉన్నవారు తమ సీటు దగ్గరకు కాదు కదా, కనీసం కంపార్ట్​మెంట్​ దగ్గరి వెళ్ళ లేని పరిస్థితి వచ్చింది.  ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలోనికి ప్రెస్​ను,  బాధితుల కుటుంబ సభ్యులను అనుమతించలేదు. మృతుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు.  గాయపడినవారి సంఖ్య 50 దాటింది.  కేంద్రం ఎందుకు నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నదో అర్థం కాదు.  ఢిల్లీలోని  రైల్వే స్టేషన్​లో  జరిగిన తొక్కిసలాట  సంఘటన పేదోడి  ప్రయాణ గోసను స్పష్టం 
చేస్తున్నది.  మన దేశంలోని పేదోడి పైసలతో నడిచే  రైళ్లలో వారికి స్థానం ఎక్కడ ఉందో స్పష్టం చేస్తున్నది.

మనిషి చావగానే పరిహారాలు ప్రకటించడం కాదు, పేదోడి ప్రయాణం కనీస  సదుపాయాలతో  ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలు రూపొందిం చాలి.  ప్రాణాలు పోకుండా సేఫ్ జర్నీ ఉండే విధంగా చూడాలి.​

ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్