కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు హైదరాబాద్‌ పైలట్లకు గాయాలు

కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు హైదరాబాద్‌ పైలట్లకు గాయాలు

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఆదివారం ఓ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ పైలెట్లు హైదరాబాద్‌కు చెందిన కెప్టెన్ వి. చంద్ర ఠాకూర్, నగేష్ కుమార్‌గా గుర్తించారు. ఇంజన్‌ ఫెయిల్‌ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. 

రెండు సీట్లున్న సెస్నా 152 విమానం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కూలిపోయిందని గునా కాంట్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దిలీప్ రాజోరియా తెలిపారు. ఇంజన్ వైఫల్యం కారణంగా విమానం దాదాపు 40 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టినట్లు స్థానికులు తెలిపారని ఆయన వెల్లడించారు. 

కర్ణాటకలోని బెలగావి ఏవియేషన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఈ విమానాన్ని టెస్టింగ్, మెయింటెనెన్స్ పరీక్షల కోసం గునాలోని షా-షిబ్ అకాడమీకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో అకాడమీ అధికారులతో పాటు కాంట్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, మార్చి 6న మధ్యప్రదేశ్‌లోని గుణ ఎయిర్‌స్ట్రిప్‌లో శిక్షణ విమానం కూలి ఒక మహిళా పైలట్ గాయపడ్డారు. ఎయిర్‌స్ట్రిప్‌లో అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నప్పుడు సాంకేతిక లోపంతో విమానం రన్‌వే నుండి జారి సమీపంలోని పొదల్లోకి దూసుకెళ్లింది.