శ్రీలంక జర్నలిస్టులకు ఎంసీహెచ్ఆర్డీలో ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: సమాజంలో మీడియా, జర్నలిజం కీలక పాత్ర పోషిస్తాయని ఎంసీహెచ్ ఆర్డీ డీజీ, స్పెషల్ సీఎస్ శశాంక్ గోయల్ అన్నారు. ప్రజల గొంతుకగా ఉంటూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటాయని తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ ఆర్డీలో 30 మంది టాప్ శ్రీలంక జర్నలిస్టులకు ‘‘మీడియా మెనేజ్ మెంట్” అనే అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. 

ఈ కార్యక్రమంలో డీజీ శశాంక్ గోయల్, శ్రీలంక ప్రధాని మీడియా అడ్వైజర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. డెమోక్రసీకి పిల్లర్ మీడియా  అని చెప్పారు. ప్రస్తుతం టెక్నాలజీలో వచ్చిన మార్పుల కారణంగా ప్రపంచంలో ఏ మూలాన ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మీడియాలో ఏఐ టెక్నాలజీ శరవేగంగా డెవలప్ అవుతోందని వెల్లడించారు. గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచం చిన్న కుగ్రామంగా మారిందని వివరించారు.