బెంగళూరు: ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్‌పై అవగాహన కల్పించేందుకు టెక్ కంపెనీ విప్రో, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్)తో భాగస్వామ్యమైంది. ఇందులోభాగంగా ‘ఫ్యూచర్ స్కిల్స్’ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది. ఇండియాలోని 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో 10 వేల మంది విద్యార్థులకు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సేవలందించనుంది. విప్రో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ప్రొగ్రామ్ టాలెంట్‌నెక్ట్స్‌లో భాగంగానే దీన్ని తీసుకొచ్చింది. టాలెంట్‌నెక్ట్స్‌లో భాగంగా విద్యార్థులను ట్రైన్ చేయడానికి ఫ్యాకల్టీని, అకాడమిక్ లీడర్లను సిద్ధం చేస్తుంది.
దీంతో విద్యార్థులకు క్వాలిటీ ఇంజనీరింగ్ విద్యను అందిస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ స్కిల్స్ పేరుతో విద్యార్థులకు ఈ ప్రొగ్రామ్‌ను విస్తరించింది. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వంటి వాటిపై విద్యార్థులకు విప్రో సాయం చేయనుంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో అవసరమయ్యే స్కిల్స్‌ను ఈ ప్లాట్‌ఫామ్ అందిస్తుందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవ్‌జని ఘోష్ చెప్పారు. కంటెంట్‌ను, ప్రజలను ఒక దగ్గరకు తీసుకురావడమే ఈ ప్లాట్‌ఫామ్ ఉద్దేశమని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ చెప్పారు.