- హైదరాబాద్‌లో త్వరలో బుచరీ అకాడమీ
- దేశంలో ఇదే మొదటి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
- తొలి దశలో 500 మందికి శిక్షణ.. తర్వాత జాబ్ ప్లేస్‌మెంట్..
- పెరిగిన ఆన్‌లైన్ నాన్ వెజ్ స్టోర్లు.. రోజూ వేలల్లో ఆర్డర్లు
హైదరాబాద్, వెలుగు: చికెన్, మటన్, చేపలు కొట్టడంలో ట్రైనింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్‌లో బుచరీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటవుతోంది. నీట్‌గా, క్లీన్‌గా, మంచి షేప్‌లో పీసులు కట్ చేసే వారిని తయారు చేసేందుకు త్వరలో అకాడమీ మొదలు కానుంది. ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించి రానున్న 8 నెలల్లో 500 మందిని ట్రైన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రొటీన్స్ హైజెనిక్ నాన్ వెజ్ మార్ట్ ఫౌండర్ విజయ్ చౌదరి త్రిపురనేని చెప్పారు. ఈ బుచర్స్ అకాడమీ షురువైతే.. దేశంలో తొలి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌గా రికార్డు సృష్టించనుంది. ఇందులో ట్రైనింగ్ సమయంలోనే స్టైఫండ్ ఇచ్చి.. తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఆన్‌లైన్ మీట్ మార్కెట్‌కు మస్త్ గిరాకీ ఉండటంతో రానున్న రోజుల్లో ఇలాంటి మరన్ని అకాడమీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
లాక్‌డౌన్ నుంచి..
ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా రూ.3,500 కోట్ల నాన్‌వెజ్ బిజినెస్ జరుగుతోంది. అయితే కరోనా టైంలో చికెన్ షాపులకు వెళ్లేందుకు జనం భయపడ్డారు. గతేడాది లాక్ డౌన్ టైం నుంచి ఆన్‌లైన్‌లో మీట్ కొనేందుకు మస్త్ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కూడా నీట్‌గా, హైజెనిక్ గా ఉంటేనే తినేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఆన్‌లైన్ హైజెనిక్ మీట్ స్టోర్లు చాలా పుట్టుకొచ్చినయ్. లీషియస్, టెండర్ కట్, ఎలైట్ నాన్ వెజ్ ఇవన్నీ అప్పుడే ఫామ్‌లోకి వచ్చినయ్. లాక్ డౌన్ కంటే ముందు ఒక కంపెనీకి రోజుకి వెయ్యి ఆర్డర్స్ వస్తే లాక్ డౌన్ లో రోజుకి 3 వేలకు ఆర్డర్స్ వచ్చాయి. దీంతో బుచర్స్ కి ఫుల్ డిమాండ్ పెరిగింది. మరోవైపు ఆన్‌లైన్ నాన్ వెజ్ స్టోర్లు, యాప్ లు తమ సైట్లలో ముక్కలు కొట్టే విధానాన్ని కూడా వీడియోలు తీసి పెడుతుంటాయి. అలాంటి వాటికి అట్రాక్ట్ అయి, నచ్చి చాలామంది కొంటున్నారు.
బుచర్స్కు స్పెషల్ ట్రైనింగ్
దేశంలో నాన్ వెజ్ తినేటోళ్లలో ఎక్కువ మంది తెలంగాణలోనే ఉన్నారట. 2010 జనరల్ రిటైల్, ఈ కామర్స్ బిజినెస్‌తో కంపేర్ చేస్తే 2021 నాటికి ఊహించనంతగా మార్కెట్ పెరిగిందని మీట్ వ్యాపారం చేసే వాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో 4 వేల చికెన్ షాపులు, 2 వేల మటన్ షాపులు, 2 వేల ఫిష్ స్టోర్లు ఉన్నట్లు అంచనా. ఇంకా షాపులు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టోర్లలో బుచర్స్కు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. చికెన్, మటన్, చేపలు ఎలా కొట్టాలో నేర్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదంతా ఇన్ హౌజ్‌లోనే సీనియర్ చెఫ్ లతో చేయిస్తున్నారు.
3 నెలల ట్రైనింగ్
నాన్ వెజ్ ని కట్ చేసి, అమ్మే వారిని తయారుచేయడం కోసం బుచర్స్ అకాడమీని ప్రారంభించనున్నాం. ఆసక్తి ఉన్న వారికి ట్రైనింగ్ ఇస్తూ, రూ.8వేల స్టైఫండ్ కూడా ఇస్తాం. మూడు నెలల పాటు స్టోర్‌లో ట్రైనింగ్ ఉంటుంది. పదో తరగతి పాసైన వారిని రిక్రూట్ చేస్తున్నాం. ట్రైనింగ్‌లో మంచి ప్రతిభ కనబరిస్తే రెగ్యులర్ ఎంప్లాయిస్ గా తీసుకుంటాం.
- విజయ్ చౌదరి త్రిపురనేని, ఫౌండర్, ప్రొటీన్స్ హైజెనిక్ నాన్ వెజ్ మార్ట్
కస్టమర్ అడిగినట్లుగా..
లాక్ డౌన్ లో ఆన్‌లైన్ మీట్ సేల్స్ చాలా పెరిగాయి. మా బిజినెస్ ట్రిపుల్ అయింది. మా స్టోర్లలో ఒక్కోచోట పదిమందికి పైగా మీట్ కట్ చేసేవాళ్లు ఉన్నారు. మాంసాన్ని కస్టమర్ కోరిన విధంగా కట్ చేసి పంపుతాం. నీట్‌గా, హైజెనిక్ గా ఉండేలా చూస్తున్నాం. మా దగ్గర మటన్, చికెన్, సీ ఫుడ్ తో పాటు రెడీ టు కుక్ ప్యాక్‌లు ఉంటాయి.
- నిశాంత్ చంద్రన్, సీఈఓ, టెండర్ కట్స్
ఆన్‌లైన్‌లో ఫుల్ ఆర్డర్లు
ఆన్‌లైన్ మీట్ స్టోర్స్ తమ స్టాఫ్‌కు రోజు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాయి. తాము టచ్ ఫ్రీ ప్యాకింగ్ విధానాన్ని అనుసరిస్తున్నమని ‘టెండర్ కట్స్’ ఆన్‌లైన్ మీట్ స్టోర్ ఫౌండర్ నిశాంత్ చంద్రన్ తెలిపారు. ఇందుకోసం బుచర్స్కు ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. చికెన్, మటన్, సీఫుడ్ నీట్‌గా కడిగిన తర్వాతే ప్యాక్ చేసి అందిస్తున్నమని చెప్పారు. ఆర్డర్ నుంచి డెలివరీ దాకా అంతా కాంటాక్ట్ లెస్‌గానే సాగుతున్నట్లు తెలిపారు. రెండేళ్లలో ఈ ఆన్‌లైన్ మీట్ కంపెనీలకు రోజూ వేలల్లో ఆర్డర్లు వస్తున్నాయి. లాక్ డౌన్లో ఒక్కొక్క కంపెనీ అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి.