ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై.. మేస్త్రీలకు ట్రైనింగ్‌‌

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై.. మేస్త్రీలకు ట్రైనింగ్‌‌
  •  ఇందిరమ్మ హౌసింగ్‌‌ కార్పొరేషన్‌‌ ఆధ్వర్యంలో ఆరు రోజుల శిక్షణ
  • మండలానికి ఇద్దరు చొప్పున ఎంపిక
  • రూ.5 లక్షల్లోపు ఇండ్లు కట్టాలో వివరిస్తున్న డెమానిస్ట్రేటర్స్‌‌
  • క్లాస్‌‌ల అనంతరం ప్రాక్టికల్‌‌గా ఇంటి నిర్మాణం
  • రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్లాస్‌‌లు ప్రారంభిస్తున్న సర్కార్‌‌

మహబూబ్‌‌నగర్‌‌, వెలుగు : పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికి ప్రయారిటీ ఇవ్వడంతో పాటు జనవరి 26 నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే ఒక మోడల్‌‌ ఇందిరమ్మ ఇంటిని నిర్మించగా.. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై మేస్ర్తీలకు ట్రైనింగ్‌‌ ఇస్తోంది.

పేదలు అప్పుల పాలు కాకుండా, రూ.5 లక్షల బడ్జెట్‌‌లో ఇండ్లు ఎలా కట్టాలన్న విధానంపై మేస్త్రీలకు ఆరు రోజుల శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ క్లాసెస్‌‌ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు ప్లాన్‌‌ చేయగా... ఇప్పటికే పాలమూరు, మెదక్, సంగారెడ్డి, నాగర్‌‌కర్నూల్‌‌, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో మొదలయ్యాయి. పాలమూరులో శనివారంతో క్లాస్‌‌లు పూర్తి కాగా మిగతా జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్నాయి.

మండలానికి ఇద్దరు మేస్త్రీలు ఎంపిక

ఇందిరమ్మ హౌసింగ్‌‌ కార్పొరేషన్‌‌ ఆధ్వర్యంలో మేస్త్రీలకు ఆరు రోజుల పాటు ట్రైనింగ్‌‌ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 3న ప్రభుత్వం ప్రారంభించింది. ఆయా జిల్లాల్లో మేస్త్రీల ఎంపిక పూర్తయితే వెంటనే క్లాస్‌‌లు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి మండలానికి ఇద్దరిని మాత్రమే సెలెక్ట్‌‌ చేయాలని స్పష్టం చేసింది. దీంతో హౌసింగ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫీసర్లు మండలాల్లో పర్యటిస్తున్నారు.

ప్రతి మండలంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి ఆసక్తి ఉన్న ఇద్దరు మేస్త్రీలను ఎంపిక చేస్తున్నారు. వీరికి నేషనన్‌‌ అకాడమీ ఆఫ్‌‌ కన్‌‌స్ట్రక్షన్స్‌‌ (ఎన్ఏసీ)కి చెందిన డెమానిస్ట్రేటర్‌‌ ద్వారా ట్రైనింగ్‌‌ ఇప్పిస్తున్నారు. ప్రతి బ్యాచ్‌‌లో 20 నుంచి 25 మంది చొప్పున ట్రైనింగ్‌‌ ఇస్తున్నారు. 25 మంది కంటే ఎక్కువ మంది మేస్త్రీలు ఉన్న జిల్లాల్లో సెకండ్‌‌ బ్యాచ్‌‌లో కూడా ట్రైనింగ్‌‌ ఇచ్చేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం రోజుకు రెండు సెషన్స్‌‌ చొప్పున క్లాసులు నిర్వహిస్తున్నారు.

ఆరు రోజుల శిక్షణలో ముఖ్యాంశాలివే...

మేస్ర్తీలకు ఆరు రోజుల శిక్షణలో ట్రైనర్లు పవర్‌‌ పాయింట్‌‌ ప్రజంటేషన్‌‌తో పాటు ఇందిరమ్మ ఇంటిని రూ.5 లక్షలలోపు ఎలా కట్టాలన్న విధానంపై ప్లాన్‌‌ గీసి మరీ చూపిస్తున్నారు. క్లాస్‌‌ల అనంతరం బయట ఉన్న ఖాళీ స్థలంలో డెమో ఇందిరమ్మ ఇంటిని సైతం కట్టిస్తున్నారు. రూ.5 లక్షలకు మించకుండా ఇండ్లు ఎలా కట్టాలనే విధానాన్ని ప్రాక్టికల్‌‌గా చూపుతున్నారు. నాలుగైదు రకాల ఫుట్టింగ్స్‌‌ గురించి చెబుతున్నారు.

ఇంటి నిర్మాణంలో ఏ మెటీరియల్‌‌ వాడాలో చెబుతూ... లోకల్‌‌గా తక్కువ రేటుకు దొరికే మెటీరియల్‌‌కు ప్రయారిటీ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఖర్చును బట్టి ఇంటి నిర్మాణానికి ఫ్లయాష్‌‌తో తయారు చేసిన సిమెంట్‌‌ ఇటుకలు లేదా ఎర్రమట్టితో చేసిన ఇటుకలు వాడొచ్చని, స్థలాన్ని బట్టి ఫుట్టింగ్స్‌‌ను గుర్తించాలని, ఆర్చ్‌‌ ఫౌండేషన్‌‌, రెయిల్‌‌ ఫౌండేషన్, గోడలను ఇచ్చిన ప్లాన్‌‌ ప్రకారం కట్టాలని, స్లాబ్‌‌ సిస్టమ్‌‌ను కూడా పలు రకాలుగా చూపిస్తున్నారు. ఒక రకంలో పెంకులు కూర్చోబెట్టి మధ్యమధ్యలో సీల్‌‌ ఫిక్స్‌‌చేసి కాంక్రీట్‌‌ వేయడం, మరో రకంలో బెంగళూరు టైల్స్‌‌ కూర్చోబెట్టి మధ్య మధ్యలో స్టీల్‌‌ ఫిక్స్‌‌చేసి స్లాబ్‌‌ వేయడం, ఇంకో రకంలో షాబాద్‌‌ బండలు వేసి దానిని సీల్‌‌ చేసి కాంక్రీట్‌‌ వేయడం వంటి విధానాలను అనుసరించాలని సూచనలు చేస్తున్నారు.

మొత్తం 440 స్వేర్‌‌ ఫీట్ల(40 గజాలు)లో ఇంటి నిర్మాణాన్ని ప్లాన్‌‌ చేస్తున్నారు. అన్ని ఇండ్లకు ఒకే రకమైన ప్లాన్‌‌ను ఇంప్లిమెంట్‌‌ చేస్తున్నారు. కిచెన్, హాల్, ఒక బెడ్‌‌రూమ్‌‌, లెట్రిన్‌‌, బాత్‌‌రూమ్‌‌ వేర్వేరుగా ఉండేలా ప్లాన్‌‌ చేస్తున్నారు. స్నానాల గదిని బెడ్‌‌రూమ్‌‌కు అటాచ్‌‌ చేస్తూ, లెట్రిన్‌‌ను మాత్రం బయట మెట్ల కింద నిర్మించేలా ప్లాన్‌‌ చేశారు. వెంటిలేషన్‌‌ కోసం నాలుగు కిటికీలు ఉంటాయి. ఆరు రోజులు ట్రైనింగ్‌‌ పూర్తి చేసుకున్న మేస్త్రీలకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వనున్నారు.

పవర్‌‌ పాయింట్‌‌ ప్రజంటేషన్‌‌ ద్వారా వివరిస్తున్నరు

రూ.5 లక్షల బడ్జెట్‌‌లో ఇండ్లు ఎలా కట్టాలి అనే దానిపై క్లాస్‌‌లు ఇస్తున్నారు. పవర్‌‌ పాయంట్‌‌ ప్రజంటేషన్‌‌ ద్వారా వివరింగా చెబుతున్నారు. ఈ శిక్షణతో క్లాస్‌‌వైజ్‌‌గా అవగాహన పెంచుకుంటున్నాం. ఇండ్లు కట్టుకునే వారికి మేలు కలిగేలా నిర్మాణాలు ఉండాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. వారి సలహా మేరకు రూ.5 లక్షల బడ్జెట్‌‌లో పేదలకు ఇండ్లు కట్టిస్తాం. – నర్సింహులు, మేస్ర్తీ, గంఢీడ్‌‌