సిరిసిల్ల నేతన్నలకు సూరత్​లో శిక్షణ

  • ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త టెక్నాలజీపై ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు 
  • ట్రైనింగ్ పూర్తయ్యాక మోడ్రన్ లూమ్స్ కొనుగోలుకు బ్యాంక్ రుణాలు
  •     పాత సాంచాలు, కాలం చెల్లిన పద్ధతులకే పరిమితమైన కార్మికులు 
  •     మార్కెట్​లో పోటీ పడేలా నేతన్నలను తీర్చిదిద్దాలని సర్కార్ నిర్ణయం 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మళ్లీ పూర్వవైభవం తేవాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. పాత సాంచాలు, కాలం చెల్లిన పద్ధతులకే పరిమితమైన నేత కార్మికులకు టెక్స్ టైల్స్​రంగంలో వచ్చిన కొత్త టెక్నాలజీపై సూరత్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఆసాములతో చర్చించి బృందాలుగా ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న నేతన్నలకు ట్రైనింగ్ ఇప్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు చేనేత జౌళిశాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి ప్రకటన చేయడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

99 శాతం సాంచాలు పాతవే..

సిరిసిల్లలో ప్రస్తుతం ఉన్న సాంచాల్లో 30 వేల దాకా (99 శాతం) కాలం చెల్లినవే. వీటిపై షిఫ్ట్ కు (12 గంటల్లో) కేవలం 25 మీటర్ల వస్త్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేసే వీలుంది. కానీ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎయిర్​జెట్, వాటర్ జెట్, ర్యాపియర్​లాంటి మోడ్రన్ ​లూమ్స్​పై  గంటకు 400 మీటర్ల క్వాలిటీ క్లాత్ ​ప్రొడ్యూస్​ చేస్తున్నారు.

సిరిసిల్లలో 1,800 మంది ఆసాములు, 6 వేల మంది పవర్​లూమ్ ​కార్మికులు ఉన్నారు. వీళ్లు కొన్నేండ్లుగా బతుకమ్మ చీరల ఆర్డర్లతో పాలిస్టర్ వస్త్రాల ఉత్పత్తికే పరిమితమయ్యారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఘనమైన చరిత్ర ఉంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరలతో ప్రపంచ ఖ్యాతి గాంచింది. ఇక్కడ ఉత్పత్తి అయిన బట్టకు రాష్ట్రంలో మంచి గిరాకీ ఉండేది.

ముఖ్యంగా సిరిసిల్లలో తయారైన  క్లాత్ ను హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారులు కొనేవారు. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు రావడంతో సిరిసిల్లలో ఇతర వస్త్రాల ఉత్పత్తి తగ్గింది. దీంతో హైదరాబాద్​వ్యాపారులు సిరిసిల్లకు బదులు మాలేగావ్ నుంచి క్లాత్​ దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. అక్కడ తక్కువ ధరకే క్వాలిటీ క్లాత్ ​దొరుకుతుండడంతో క్రమంగా సిరిసిల్లలో తయారైన క్లాత్​కు గిరాకీ పడిపోయింది. ఫలితంగా సిరిసిల్లలో ఇప్పటికే 2 కోట్ల మీటర్ల క్లాత్ ​పేరుకుపోయింది. 

మోడ్రన్ ​లూమ్స్​కు లోన్లు..

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభంలో నుంచి బయటపడేసేందుకు నేత కార్మికులు, ఆసాములకు మోడ్రన్ ​లూమ్స్​పై శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి గల కార్మికులందరినీ టీమ్​లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చుతో  గుజరాత్ లోని సూరత్, మహారాష్ట్రలోని మాలేగావ్, తమిళనాడులోని తిరువూర్ కు తీసుకెళ్లి ట్రైనింగ్​ ఇప్పించాలని భావిస్తోంది.

గంటకు 400 మీటర్లకు పైగా క్వాలిటీ క్లాత్​ఉత్పత్తి చేసే ఎయిర్ జెట్, వాటర్ జెట్ లాంటి ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయాలంటే ఒక్కో మిషన్ కు రూ.50 లక్షలకు పైగా వెచ్చించాల్సి ఉంటుంది. స్టడీ టూర్​అనంతరం వీటి ఏర్పాటుకు ముందుకు వచ్చే నేతన్నలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని సర్కార్ చెబుతోంది. కార్మికులు సొంతకాళ్లపై నిలబడేదాకా నూలుపై సబ్సిడీ ఇస్తామంటోంది. ఈ మేరకు చేనేత జౌళిశాఖ డైరెక్టర్​అలుగు వర్షిణి తాజాగా చేసిన ప్రకటనపై కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.  

కార్మికులు స్కిల్స్​ డెవలప్​చేసుకోవాలి

మారుతున్న కాలానికి అనుగుణంగా సిరిసిల్ల నేతన్నలు స్కిల్స్​డెవలప్​చేసుకోవాలి. అప్పుడే మార్కెట్​లో పోటీ పడగలం. ఆ దిశగా శిక్షణ ఇప్పించేందుకు సర్కారు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాజీవ్ విద్యా మిషన్ కింద 65 లక్షల మీటర్ల యూనిఫామ్ క్లాత్​కు ప్రభుత్వం ఆర్డర్​ఇచ్చింది. గతేడాది ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించి రూ.200 కోట్లకు పైగా ఉన్న బకాయిలను సెప్టెంబర్ వరకు రిలీజ్​చేస్తాం. కార్మికులు ప్రతిసారీ ప్రభుత్వంపై ఆధారపడడం మంచిది కాదు. ప్రైవేట్​రంగంలోని అవకాశాలను అన్వేషించాలి. అందుకోసం ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తాం. 
- అలుగు వర్షిణి, 
చేనేత జౌళి శాఖ డైరెక్టర్​