మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇచ్చేందుకు చేపడుతున్న సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో డిజిటల్ కార్డ్ హౌజ్ హోల్డ్ సర్వే కోసం ఏర్పాటు చేసిన టీమ్స్‌కు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్ వార్డు, గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశామని తెలిపారు. ఎంపిక చేసిన గ్రామం, వార్డులో ఈ నెల 3 నుంచి 7 వరకు 5 రోజుల పాటు సర్వే నిర్వహించాలని సూచించారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో హన్వాడ మండలం మాదారం గ్రామం, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని 37వ వార్డు, జడ్చర్ల మండలం అల్వాన్ పల్లి గ్రామం, జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డు, దేవరకద్ర నియోజకవర్గంలో చిన్నచింతకుంట మండలం సీతారాంపేట, భూత్పూరు మున్సిపాలిటీలోని 9వ వార్డును పైలెట్ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. టీమ్ లీడర్లుగా తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ ను నియమించగా, సభ్యులుగా పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామిరెడ్డి, డీపీవో పార్థ సారథి పాల్గొన్నారు.