దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివిధ దశల్లో జరుగుతున్నాయి. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోకసభ ఎన్నికలు సైతం జరుగనున్నాయి. అలాగే తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సైతం అదే రోజు జరుగనున్నాయి. అయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లోని ఆంధ్రా సెటిలర్లంతా... ఆంధ్రప్రదేశ్లోని స్వస్థలాలకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకోనేందుకు సిద్దమయ్యారు.
ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా.. వారి సొంత ఊర్లకు వెళ్లిపోయారు. మరికొంత మంది బన్సులు, రైళ్లలో వెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకున్నారు. దీంతో వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగింది. అలాంటి వేళ ప్రయాణికుల రద్దీతోపాటు వేసవిని దృష్టిలో పెట్టుకొని.. పలు రైళ్లలో ప్రత్యేక బోగీలను ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన ప్రకటనను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. మే 10వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు పలు మార్గాల్లో ఈ అదనపు కోచ్ లు సేవలు అందించనున్నాయి. వీటిలో థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ కోచ్లు ఉన్నాయి. . ఈ రైల్వే సర్వీసులన్నీ ఆంద్రా, తెలంగాణ మధ్యే నడుస్తాయి.