- తొమ్మిదేళ్లుగా రైల్వే స్టేషన్లలో కొత్త హాల్టింగ్‌లు లేవు
- కొన్ని చోట్ల రెండింటితో సర్దుకోవాలె
- రైళ్లకు హాల్టింగ్‌లు ఇప్పించలేని ఎంపీలు
- విజ్ఞప్తులను పట్టించుకొని రైల్వేశాఖ
- మంచిర్యాల జిల్లాలో హల్టింగ్ ఇవ్వాలని స్థానికుల వేడుకోలు
కోల్‌బెల్ట్, వెలుగు: ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే కీలకమైన రైల్వే మార్గం ఉన్న మంచిర్యాల జిల్లాలోని రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆపడం లేదు. ఏళ్లుగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ కోసం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పారిశ్రామికంగా, వ్యాపారంగా ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ లాంటి పట్టణాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రధాన రైళ్లు ఆగకుండా పోతున్నాయి. తొమ్మిదేళ్ల కాలంలో కనీసం ఒక్క ట్రైన్‌కు కొత్తగా హాల్టింగ్ కల్పించలేదు. ఆదాయం వచ్చే రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికులకు కనీస సౌలత్‌లను రైల్వే శాఖ కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఇటీవల పలు రైళ్లకు హాల్టింగ్‌లు కల్పించాలని స్థానికులు ఆందోళనలు చేసినా రైల్వే ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.
తొమ్మిదేళ్లలో కొత్త హాల్టింగ్‌లు లేవు
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని రైల్వే స్టేషన్ల నుంచి రైల్వే శాఖ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని(రామకృష్ణాపూర్), రేచినీరోడ్(తాండూర్) రైల్వే స్టేషన్ల మీదుగా స్థానికులు దేశంలోని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వేలను ప్రధాన ప్రయాణ సాధనంగా ఉపయోగిస్తుంటారు. పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన వివేక్ వెంకటస్వామి హయంలోనే మాత్రమే కొత్త రైళ్లు, పలు రైళ్లకు హాల్టింగ్‌లు కల్పించారు. తర్వాత ఐదేళ్లపాటు పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన బాల్క సుమన్ ఆరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెడితే జిల్లా స్టేషన్లలో ఒక్కదానికి కూడా హాల్టింగ్ కల్పించలేకపోయారు. ప్రస్తుత ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌నేత సైతం ఇప్పటి వరకు కొత్తగా ఒక్క హాల్టింగ్ కూడా ఇప్పించలేకపోయారు.
రాజధానికి వెళ్లడమంటే నరకమే
జిల్లా ప్రజలకు సరిపడ రైళ్లు లేకపోవడంతో నరకయాతన మధ్య ప్రయాణాలు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌పై ఆధారపడాల్సిందే. ఇక్కడ మిగిలిన స్టేషన్ల కంటే రెండు మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కలిగి ఉండటమే కారణం. సామాన్య ప్రజలు ఉదయం హైదరాబాద్‌కు వెళ్లడానికి ఏకైక రైలు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే. గతంలో సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు ఉన్నప్పుడు జిల్లా వాసులు సులభంగా హైదరాబాద్‌కు వెళ్లేవారు. ఆ రైలును మహారాష్ట్ర మన్మాడ్ వరకు పొడిగించడంతో జిల్లా వాసులు కనీసం కాలు పెట్టడానికి కూడా జాగ ఉండదు. ఇందులో ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఈ రైలు మిస్సయితే మళ్లీ మధ్యాహ్నం వరకు ఒక్క రైలు అందుబాటులో లేదు. రాష్ట్ర రాజధాని నుంచి తిరుగు ప్రయాణంలో సాయంత్రం 3 గంటలకు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ మిస్సైతే ఇక రావడం మరుసటి రోజే.
రెండు రైళ్లతోనే సర్దుకోవాల్సిందే..
కరోనా లాక్డౌన్ సడలింపు తర్వాత ఇంతకు ముందున్న ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చిన రైల్వే శాఖ హాల్టింగ్ పాయింట్లను తగ్గించింది. కాజీపేట జంక్షన్ నుంచి మంచిర్యాల మీదు సిర్పూర్‌కు రాకపోకలు సాగించే రామగిరి, సింగరేణి, అజ్నీ ప్యాసింజర్లను(బల్లర్షా- కాజీపేట) ఎక్స్‌ప్రెస్‌లు మార్చారు. అయితే వీటిని సింగరేణి కార్మిక కుటుంబాలు అత్యధికంగా ఉండే మందమర్రి, రేచీని రోడ్ రైల్వే స్టేషన్లలో ఆపడం లేదు. కేవలం భాగ్యనగర్, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మాత్రమే హాల్టింగ్ కల్పించారు. కరీంనగర్ ఫుష్ పుల్ రైలు అంతంత మాత్రమే సేవలు అందిస్తోంది. సింగరేణి కంపెనీ మొయిన్ ఆఫీస్ కొత్తగూడెంలో ఉండటంతో కార్మికులు తప్పనిసరిగా సింగరేణి ఎక్స్‌ప్రెస్(భద్రాచలం- సిర్పూర్)పై
ఆధారపడుతుంటారు.
ఆదాయం వస్తున్న ఆపుతలేరు..
కాజీపేట- బల్లర్షా రైల్వే మార్గంలో అత్యంత ఆదాయాన్ని ఇచ్చేది మంచిర్యాల రైల్వే స్టేషన్. కానీ దూరప్రాంతాలకు వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం లేదు. ఇక్కడ రోజుకు ప్రయాణికుల నుంచి రూ.5 లక్షల ఆదాయం వస్తుండగా జిల్లాలోని మిగిలిన బెల్లంపల్లి, రవీంద్రఖని(రామకృష్ణాపూర్), మందమర్రి, రేచిన్‌రోడ్డు స్టేషన్ల నుంచి మరో రూ.5లక్షలకు పైగా ఆదాయాన్ని రైల్వేశాఖ అర్జిస్తోంది. మంచిర్యాలలో ఏపీ ఎక్స్‌ప్రెస్, కేరళ్, హంసఫర్, పూరి-కాజీపేట, బికనేర్, సంఘమిత్ర రైళ్ల హాల్టింగ్‌కు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రవీంద్రఖనిలో కాజీపేట- బల్లర్షా ఎక్స్‌ప్రెస్(అజ్నీ), దక్షిణ్, జీటీ, జనతా, హైదరాబాద్- నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లకు, మందమర్రిలో సింగరేణి, రామగిరి, కాజీపేట- బల్లర్షా ఎక్స్‌ప్రెస్, దక్షిణ్, జనతా ఎక్స్‌ప్రెస్, బెల్లంపల్లిలో జీటీ, నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు, రేచిన్లో సింగరేణి, రామగిరి, కాజీపేట- బల్లర్షా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని స్థానికులు ఎంపీలు, మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందించారు. ఇటీవల మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామిని కలిసిన జిల్లా వాసులు, బీజేపీ లీడర్లు రైళ్ల హాల్టింగ్‌కు చొరవచూపాలని విజ్ఞప్తి చేశారు.