జాబ్‍ రిక్రూట్‍మెంట్లలో ట్రాన్స్​జెండర్ల ఇబ్బందులు

వరంగల్‍, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పోటీ పడుతున్న వేలాదిమంది ట్రాన్స్​జెండర్లు సరికొత్త సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు జాబ్‍ నోటిఫికేషన్లు ఇచ్చే క్రమంలో అప్లికేషన్ ఫారంలో థర్డ్ జెండర్‍ ఆప్షన్‍ ఇస్తోంది. తీరా కాంపిటీషన్‍ ఎగ్జామ్‍లు, ఈవెంట్లు పెట్టే సమయంలో కొన్నిచోట్ల మేల్‍, మరికొన్నిచోట్ల ఫిమేల్‍ కేటగిరిల్లో పోటీ పడాలని చెబుతున్నారు. సర్టిఫికెట్లో అబ్బాయిలుగా ఉండి ఏండ్ల క్రితమే అమ్మాయిలుగా మారిన హిజ్రాలకు రిక్రూట్‍మెంట్‍లో ప్రత్యేకంగా ఓ గ్రూప్‍ పెట్టడంలేదు. దీంతో వారంతా అబ్బాయిలతో పోటీ పడలేక ఉద్యోగాలకు దూరమవుతున్నారు. ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్‍ కల్పించాలని 2014లోనే సుప్రీం కోర్టు రాష్ట్రాలకు సూచించినా అమలు చేయట్లేదు. దీంతో జీవితాలకు భరోసా కల్పించే జాబ్‍ కాంపిటీషన్లలో వారికి అన్యాయం జరుతోంది. 

రాష్ట్రంలో 58 వేల మంది ట్రాన్స్​జెండర్లు

ప్రభుత్వ లెక్కలు, యూనియన్‍ మెంబర్‍షిప్‍ ఆధారంగా రాష్ట్రంలో 58 వేల మంది ట్రాన్స్​జెండర్లు ఉన్నారు. అనధికారంగా లక్షల్లో ఉంటారని తెలుస్తోంది. ఇందులో చదువుకున్నవారు గతంలో 50 శాతం వరకు ఉండగా.. ప్రస్తుత జనరేషన్‍లో 70 నుంచి 80 శాతం వరకు తక్కువలో తక్కువ ఇంటర్మీడియేట్‍, డిగ్రీ పూర్తి చేసినవారున్నారు. మొత్తంగా ట్రాన్స్​జెండర్లలో 50 శాతం మందికి ఉద్యోగాలకు కావాల్సిన క్వాలిఫికేషన్‍ ఉంటోంది. రాష్ట్రంలో పది, పదిహేనేళ్ల క్రితం వారితో పోలిస్తే.. ప్రస్తుత ట్రాన్స్​జెండర్లు గౌరవప్రద జీవితాలను కోరుకుంటున్నారు. అందరిలానే చదువు, ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. గవర్నమెంట్‍ ఉద్యోగాల నోటిఫికేషన్లు రిలీజ్‍ చేసే సమయంలో జాబ్‍ కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుత జనరేషన్ హిజ్రాల్లో 90 శాతం మందికి పైగా సెక్స్ వర్క్ లేదంటే రోడ్లు, బస్సు, రైళ్లలో బిక్షాటన చేయడాన్ని ఇష్టపడట్లేదు. ట్రాన్స్​జెండర్లు వారి కమ్యూనిటీలో ఉన్నతస్థాయిలో ఉన్నవారిని రోల్‍మాడల్‍గా తీసుకుని ముందుకు సాగుతున్నారు. బంగారు భవిష్యత్‍ కావాలని ఆశ పడుతున్నారు. దానికి అవసరమైన ప్రతిభను సాధించడానికి కష్టపడుతున్నారు. 

టెన్త్​ సర్టిఫికెట్​ ఆధారంగానే గుర్తింపు

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వేలాది థర్డ్​జెండర్లు వారి పదో తరగతి సమయంలో అబ్బాయిలుగానే ఉన్నారు. ఆపై హిజ్రాలుగా మారారు. కాగా, అధికారులు పదో తరగతి మెమో ఆధారంగా చూస్తున్నారు తప్పితే వారిని  థర్డ్​ జెండర్‍గా గుర్తించడం లేదు. తాము అమ్మాయిలుగా మారామని, అబ్బాయిలతో సమానంగా పోటీ పడలేమని చెబుతున్నా వినడం లేదు. దీంతో వీరికి అన్యాయం జరుగుతోంది. జిల్లాల్లో జరిగే ఎన్నికల ప్రచారాల్లో, ట్రాన్స్​జెండర్ల మీటింగులకు హాజరయ్యే సమయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు థర్డ్​జెండర్‍ కోటాలో సముచిత గౌరవం దక్కేలా కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. తర్వాత లైట్‍ తీసుకుంటున్నారు. గ్రేటర్‍ మున్సిపల్‍ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, బస్టాండ్లలో టాయిలెట్ల నిర్వహణ, బజ్జీల బండ్లు పెట్టుకునేలా అవకాశం కల్పిస్తున్నారు తప్పితే.. ఉద్యోగావకాశాల్లో చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.    

స్పందించని రిక్రూట్‍మెంట్‍ బోర్డులు

ప్రభుత్వ జాబ్‍ నోటిఫికేషన్లలో రాష్ట్ర సర్కారు థర్డ్​జెండర్లకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఇవ్వకపోవడంతో చాలాచోట్ల రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. యూనియన్ల తరఫున ప్రభుత్వ పెద్దలు, రిక్రూట్‍మెంట్‍ బోర్డులను కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తప్పనిసరి సమయాల్లో కోర్టు ​గడప తొక్కితే కొన్నిసార్లు న్యాయం జరుగుతున్నా.. అప్పటికే రిక్రూట్‍మెంట్‍ ప్రాసెస్ పూర్తయినచోట వీరికి అన్యాయమే జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్‍ రిక్రూట్‍మెంట్‍జరుగుతోంది. కొందరు హిజ్రాలు ఈవెంట్లకు సెలెక్ట్ అయ్యారు. కాగా, సర్టిఫికెట్ల ఆధారంగా అధికారులు వారిని అబ్బాయిలతో పోటీ పడాలని సూచిస్తున్నారు. ఏండ్ల కిందే అమ్మాయిలుగా మారిన అభ్యర్థులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మేల్‍, ఫిమేల్‍ మాదిరి థర్డ్​జెండర్‍ కోటాలో పోటీలు పెట్టాలని డిమాండ్‍ చేస్తున్నారు. ఇదే విషయమై కోర్టు గడప తొక్కారు.

థర్డ్​జెండర్‍ కోటా అమలు చేయాలె

రాష్ట్రంలో నిర్వహించే జాబ్‍ నోటిఫికేషన్లు, రిక్రూట్‍మెంట్‍ ప్రాసెస్‍లో అధికారులు థర్డ్​జెండర్‍ కోటా తప్పకుండా అమలు చేయాలె. హిజ్రాల కోసం అది చేస్తం..ఇది చేస్తమని మాట్లాడే లీడర్లు, ఆఫీసర్లు తీరా మా జీవితాలకు గౌరవం ఇచ్చే ఉద్యోగాల సెలక్షన్‍లో మాత్రం అన్యాయం చేస్తున్నరు. అప్లికేషన్‍ ఫారంలో థర్డ్‍జెండర్‍ ఆప్షన్‍ ఉన్నా.. ఆ కోటాలో నియామకాలు మాత్రం చేపట్టడం లేదు. దీంతో అన్యాయానికి గురవుతున్నాం. ప్రస్తుతం జరుగుతున్న పోలీస్ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లలో సైతం రిజర్వేషన్లు, థర్డ్​జెండర్‍ కోటా తప్పక అమలు చేయాలి. – లైలా, ట్రాన్స్​జెండర్‍ యూనియన్‍ రాష్ట్ర అధ్యక్షురాలు