- డిపాజిటర్లకు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ మొండిచేయి
- నాలుగు నెలల కింద చైర్మన్ సత్యనారాయణను అరెస్ట్ చేసిన సిట్ ఆఫీసర్లు
- అకౌంట్స్ ఫ్రీజ్.. నాలుగు నెలలుగా ట్రాన్సాక్షన్లకు బ్రేక్
- డబ్బుల కోసం ఫస్ట్ ఫైనాన్స్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న డిపాజిటర్లు
- రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 బ్రాంచ్‌లు, 10 వేల మందికి పైగా మెంబర్స్
మంచిర్యాల, వెలుగు: కర్ణాటకలో జరిగిన ఓ స్కామ్‌లో మంచిర్యాలకు చెందిన ఫస్ట్ ఫైనాన్స్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ అరెస్ట్ కావడంతో డిపాజిటర్లు ఆందోళనలో పడిపోయారు. సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ కావడం, నాలుగు నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో పైసల కోసం ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును సొసైటీలో డిపాజిట్ చేశామని, ఇప్పుడు అసలు డబ్బులు వస్తాయో, రావోనని ఆవేదన చెందుతున్నారు.
ఐదేండ్ల కింద ప్రారంభమైన ‘ఫస్ట్ ఫైనాన్స్’
మంచిర్యాలకు చెందిన ఈటకారి సత్యనారాయణ ఐదేండ్ల కింద ఫస్ట్ ఫైనాన్స్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ను స్థాపించారు. హైదరాబాద్ నల్లకుంటలో హెడ్ ఆఫీస్, మంచిర్యాలలోని సున్నంబట్టివాడలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఏర్పాటు చేయగా లక్సెట్టిపేట, గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, హుస్నాబాద్‌తో పాటు ఏపీలోని విజయవాడ, తిరుపతితో కలిపి మొత్తం 13 బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో 10 వేల మందికి పైగా కస్టమర్లు ఉన్నట్టు సమాచారం. వీరికి సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు ఇవ్వడంతో పాటు ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లను సేకరించారు. సొసైటీ తరఫున సుమారు రూ.9 కోట్ల లోన్లు ఇవ్వగా, రూ.12 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు తెలుస్తోంది.
వివిధ అకౌంట్లలో స్కామ్ సొమ్ము
కర్ణాటకలో జరిగిన ఓ స్కామ్‌కు సంబంధించిన రూ.80 కోట్లు ఫస్ట్ ఫైనాన్స్ సొసైటీకి చెందిన 18 అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు, ఆ డబ్బులను తిరిగి వివిధ అకౌంట్లలో జమ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఆఫీసర్లు ఫస్ట్ ఫైనాన్స్ సొసైటీ చైర్మన్ ఈటకారి సత్యనారాయణను జూన్‌లో అరెస్ట్ చేయగా అప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. మరో వైపు ఫస్ట్ ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన అకౌంట్లను సైతం సిట్ ఆఫీసర్లు ఫ్రీజ్ చేశారు.
నాలుగు నెలలుగా నిలిచిన ట్రాన్సాక్షన్లు
ఫస్ట్ ఫైనాన్స్ సొసైటీకి చెందిన అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో నాలుగు నెలల నుంచి ట్రాన్సాక్షన్లకు ఇబ్బందులు ఏర్పడుతుండగా, ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. ఓ వైపు చైర్మన్ అరెస్ట్ కావడం మరో వైపు ట్రాన్సాక్షన్లు నిలిచిపోవడంతో డిపాజిటర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. జీతాలు రాక సిబ్బంది సైతం రిజైన్ చేసి వెళ్లిపోవడంతో కస్టమర్లకు సమధానం చెప్పే వారు కూడా లేరు. మంచిర్యాలలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌లో ఒక అటెండర్ మాత్రమే ఉన్నారు. రికవరీ ఏజెంట్లు మాత్రం లోన్లకు సంబంధించిన డబ్బులను వసూలు చేస్తున్నారు. అకౌంట్లు త్వరలోనే రిలీజ్ అవుతాయని డిపాజిటర్లకు పూర్తిగా చెల్లింపులు చేస్తామని ఉన్న ఉద్యోగులు చెబుతున్నారు.