ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభల్లో తరచూ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా గురించి చెప్పాల్సి వచ్చిన సందర్భంలో చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. మీకు గుర్తుందా.. అదేనండీ.. 'ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్త'. బీఆర్ఎస్ సర్కార్నిరంతర విద్యుత్తు సరఫరా కోసం కృషి చేస్తోందని చెప్పడానికి ఆయన వాడే డైలాగ్ఇది. ఇప్పుడు ఇదే డైలాగ్ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు నోటి వెంట వచ్చింది.
ఆయన జులై 17న మీడియాతో మాట్లాడుతూ.. కరెంటు ఎన్ని గంటలు ఇచ్చింది ముఖ్యం కాదని.. పంటలు ఎండినట్లు ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదని అన్నారు. కరెంట్సరఫరాకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని ప్రభాకర్ రావు అనడం గమనార్హం.
స్పష్టత ఇవ్వని సీఎండీ..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వ్యవసాయానికి 24 గంటల ఫ్రీ కరెంట్‌పై రాజకీయ యుద్ధం జరుగుతున్న తరుణంలో ప్రభాకర్ రావుని ఇదే అంశంపై ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. కాంగ్రెస్ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి 24 గంటల విద్యుత్తు సరఫరా కావట్లేదన్న ఆరోపణలను ఆయన వద్ద ప్రస్తావించగా స్పందించలేదు. 24 గంటల కరెంటుపై స్పష్టత ఇవ్వని ఆయన.. మీరు ఏ రిపోర్టర్ అని తిరిగి ప్రశ్నించడం గమనార్హం.
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రభాకర్‌రావు
సీఎండీ ప్రభాకర్‌రావు రాజన్న సిరిసిల్ల జిల్లా వేముల వాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.