జీహెచ్ఎంసీలో నేడో, రేపో బదిలీలు!

  •     2– 3 ఏండ్లుగా ఉంటున్నోళ్లకు స్థాన చలనం తప్పదని సమాచారం
  •     300 మందికి పైగా ప్రమోషన్లు దక్కే చాన్స్

హైదరాబాద్, వెలుగు : ఏ క్షణమైనా జీహెచ్ఎంసీలోని ఉన్నతాధికారులంతా బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రెండు, మూడేండ్లుగా ఇక్కడే పనిచేస్తున్న వారిని ట్రాన్స్​ఫర్​చేసేందుకు ఫైల్ రెడీ అయింది. అడిషనల్ కమిషనర్ నుంచి ఏఎంసీ(అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్) వరకు దాదాపు అంతా బదిలీ కానున్నారు. లోక్​సభ ఎన్నికలకు ముందే ఏండ్లుగా బల్దియాలో పనిచేస్తున్న అధికారుల వివరాలు సేకరించారు. ఎన్నికల కోడ్​రాక ముందే కొందరిని ట్రాన్స్​ఫర్​చేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా కొనసాగుతున్నవారిపై వేటు వేశారు.

తాజాగా రెండు, మూడేళ్లుగా పనిచేస్తున్న వారిపై ఫోకస్ పెట్టారు. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ మారడంతో ప్రాసెస్​కొంత లేట్​అయింది. మొత్తం 200 మంది అధికారులు బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది. అడిషనల్ జోనల్ కమిషనర్లలో కొందరు మినహా మిగతా క్యాడర్ అధికారులు 3 నుంచి 4 ఏళ్లకు మించి పనిచేస్తున్న వారే ఉన్నారు. ఎన్నికల సమయంలో జీహెచ్ఎంసీలోనే అటూ ఇటూ బదిలీ అవుతున్నారే తప్ప, జీహెచ్ఎంసీ దాటి వెళ్లడం లేదు. 

ఏండ్లుగా ఎదురుచూపులు

పదోన్నతి కోసం ఏండ్లుగా ఎదరుచూస్తున్న వారికి త్వరలో ప్రమోషన్స్ దక్కనున్నాయి. ఇప్పటికే పదోన్నతులకి సంబంధించి ఫైల్ రెడీ అయింది. రేపో, మాపో ప్రమోషన్స్ రానున్నాయి. ఫోర్త్ క్లాస్ నుంచి రికార్టు అసిస్టెంట్లుగా 90 మంది, రికార్టు అసిస్టెంట్​నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా  100 మంది, జూనియర్​అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా 72 మంది

సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్లుగా 50 మంది, సూపరింటెండెంట్​నుంచి ఏఎంసీలుగా 11మందికి పదోన్నతులు దక్కనున్నాయి. అలాగే 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని బల్దియా అధికారులు ప్రభుత్వానికి లెటర్​రాశారు. ఈ మేరకు నియామకాలు జరిగితే మరికొందరికి ప్రమోషన్స్ దక్కనున్నాయి.