![హుజురాబాద్ ఎఫెక్ట్.. కరీంనగర్ కలెక్టర్ ట్రాన్స్ ఫర్](https://static.v6velugu.com/uploads/2021/07/Transfer-on-Karimnagar-Collector-Shashanka-with-Huzurabad-by-election-effect_Sps3nHJcFU.jpg)
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. కొత్త కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్
హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్ కరీంనగర్ కలెక్టర్‌పై పడింది. ప్రభుత్వం చెప్పిన లైన్‌లో పనిచేయడం లేదన్న కారణంతో కలెక్టర్ శశాంకపై బదిలీ వేటు వేసినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఆర్డీవో, డీఎస్పీ, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సీఐలతో పాటు నియోజకవర్గ స్థాయి అధికారుల వరకే పరిమితమైన ట్రాన్స్‌ఫర్‌ల వ్యవహారం ఇప్పుడు జిల్లా స్థాయి అధికారులపైనా పడింది. హుజూరాబాద్ బైపోల్ బాధ్యతలను మానిటరింగ్ చేస్తున్న కీలక మంత్రి ఈ ట్రాన్స్‌ఫర్ వెనుక చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ కలెక్టర్ శశాంకకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయన స్థానంలో ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను నియమించింది. ఇక మహబూబాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వీపీ గౌతమ్‌ను ఖమ్మం కలెక్టర్‌గా బదిలీ చేశారు. మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అభిలాష అభినవ్‌కు మహబూబాబాద్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇద్దరు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లను కూడా ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు సీడీఎంఏ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మికుంట కమిషనర్ అనిసుర్ రషీద్ స్థానంలో మీర్‌పేట కమిషనర్ బి. సుమన్‌రావు, హుజూరాబాద్ కమిషనర్ ప్రసన్నరాణి స్థానంలో మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకన్నను నియమించారు. హుజూరాబాద్, జమ్మికుంట కమిషనర్‌లకు ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు.
వాళ్లను సీడీఎంఏలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.