ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా.. సాగుతూ ఆగుతున్నాయి. ఉపాధ్యాయుల ఆకాంక్షలు, సంఘాల ఆందోళన ఫలితంగా 2023 ఫిబ్రవరిలో బదిలీలు, పదోన్నతులను కౌన్సెలింగ్ పద్ధతిలో నిర్వహించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వెబ్ కౌన్సెలింగ్ పద్ధతిలో కౌన్సెలింగ్ జరపడానికి షెడ్యూల్ కూడా ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1974 ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్ పోస్టులు ఖాళీలుగా ఉండి పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తమయింది.
వివిధ సబ్జెక్టులలో 7,200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 2017లో 8,630 భాషా పండితులు 1849 వ్యాయామ విద్య (పిడీ)పోస్టులు అప్ గ్రేడ్ చేయడంతో ఆ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు సుమారుగా పదివేల సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అభ్యంతరాలు, కోర్టు స్టేలు
ఉపాధ్యాయులు తమ ఆసక్తులతో రెండు దశాబ్దాలుగా అమలవుతున్న ప్రాధాన్యత కేటగిరీలు, అర్హత పాయింట్ల విషయంలో అభ్యంతరం తెలుపుతూ కోర్టుల మెట్లెక్కడంతో, బదిలీలు పదోన్నతులపై స్టే రావడం వల్ల ఫిబ్రవరిలో జరగాల్సిన మొత్తం ప్రక్రియ ఆగిపోయింది . ఉపాధ్యాయ సంఘాల జిల్లా ప్రధాన బాధ్యులకు, భార్యాభర్తలు ఉద్యోగులు అయితే ఒకరికి స్పౌజ్ కేటగిరీలో ప్రాధాన్యత పాయింట్లు ఇచ్చే విషయంలో కోర్టులకు వెళ్లారు.
ఆగస్టు నెలలో ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చే ప్రాధాన్యతను తొలగించి, స్పౌజ్ కేటగిరీలో ఇచ్చే ప్రాధాన్యతను కొనసాగించాలని కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల మళ్ళీ షెడ్యూల్ ప్రారంభమైంది. బదిలీల జీవో ఐదులోని బదిలీల అనంతరం పదోన్నతులు ఇచ్చే క్రమాన్ని పాటించడం లేదని స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇవ్వకుండా సెకండరీ గ్రేడు టీచర్లకు ట్రాన్స్ఫర్ కౌన్సెలింగ్ నిర్వహించరాదని మరికొందరు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం స్టే వచ్చి ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది.
కొత్త జిల్లాల్లో హడావిడిగా పూర్తి
కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో ఆయా జిల్లాలకు క్యాడర్ను కేటాయించడానికి జీవో 317ను 2021లో ప్రభుత్వం ఇచ్చింది. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు తెలియకుండా హడావిడిగా ఆ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానిక ఉపాధ్యాయులు, ఉద్యోగులు స్థానికేతర జిల్లాలకు కేటాయించడం వల్ల విధి నిర్వహణలో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ 13 జిల్లాల స్పౌజ్ కేటగిరీ ఉపాధ్యాయులు తమ సొంత జిల్లాలకు రాలేక కుటుంబాలకు దూరంగా ఉండలేక అనేక ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఆ విషయం పరిష్కరించకుండా ఉంది.
జీవో 317 ప్రకారం బదిలీలు చేస్తున్న క్రమంలో ఉపాధ్యాయుల కేటాయింపు చేయడానికి తయారుచేసిన సీనియార్టీ జాబితాలను అక్రమాలు, అవకతవకలు, నిబంధనలకు వ్యతిరేకంగా రూపొందించి ఆదరాబాదరాగా తయారు చేసి, కేటాయింపుల ప్రక్రియ అయిందనిపించారు. ఇప్పటికీ వేలాదిమంది బాధ్యత ఉపాధ్యాయ దంపతులు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం చుట్టూ అనేక ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
- కే వేణుగోపాల్
పూర్వ అధ్యక్షుడు, ఏపీటీఎఫ్