- ఒకేచోట నాలుగేండ్ల సర్వీసు ఉన్నవారందరికీ ట్రాన్స్ఫర్
- డిప్యుటేషన్‌పై పనిచేసినచోటూ పరిగణనలోకి
- నాలుగేండ్ల సర్వీసు ఉంటేదంపతులిద్దరూ బదిలీ
- సాధారణ బదిలీలపై ఆర్థికశాఖ క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: సిటీ, పట్టణాలు వదిలి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేయబోమంటే కుదరదని రాష్ట్ర సర్కారు పేర్కొంది. ఒకేచోట నాలుగేండ్ల నుంచి పనిచేస్తున్న వారందరినీ కచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నాలుగేండ్లు సర్వీసు పూర్తయిన వారిని సాధారణ బదిలీల కింద ట్రాన్స్ఫర్ చేయనున్నందున కొన్ని అంశాలపై ఆర్థికశాఖ క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఉద్యోగులైన భార్యాభర్తలు ఒకేచోట పనిచేస్తూ నాలుగేండ్ల సర్వీసు పూర్తయితే వారిని తప్పనిసరిగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంటుందని, అలా మార్చినప్పుడు కొత్త ప్రాంతాల్లో దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగులు ఉండాలని పేర్కొంది.
కొందరు ఉద్యోగులు బదిలీల నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని పైరవీలు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. చాలామంది ఉద్యోగులైన భార్యాభర్తల్లో ఒకరు నగరంలో, మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరంతా తమ జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను కూడా అక్కడికే బదిలీ చేయాలని ‘స్పౌజ్ కేస్’ నిబంధన కింద అడుగుతున్నారు.
ఇలా అడిగేవారిని కచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని, నగరంలో పనిచేసేవారినే వారి జీవిత భాగస్వామి ఉన్న గ్రామీణ ప్రాంతానికి మార్చేందుకు ఆప్షన్ ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ సారి బదిలీల విషయంలోనూ 2018లో సాధారణ బదిలీల సందర్భంగా జారీచేసిన ‘సర్క్యులర్ మెమో నంబరు 2934-ఏ’ ప్రకారం నిబంధనలు అనుసరించాలని సూచించింది. వేర్వేరు శాఖల్లోని ఉద్యోగ దంపతులు నగరంలో 20 ఏండ్లుగా పనిచేస్తున్నట్టు వివిధ శాఖల హెచ్వోడీలు గుర్తించారు.
శాఖల్లో లోపాన్ని ఆసరాగా చేసుకొని..
శాఖల సమన్వయ లోపాన్ని ఆసరాగా చేసుకుని దంపతులిద్దరూ స్పౌజ్ కేసు నిబంధనను తమకు అనుకూలంగా మార్చుకుని, నగరంలోనే 20 ఏండ్లుగా కొనసాగుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే దంపతులు పోస్టులు ఖాళీలేక నగరానికి రాలేకపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరిద్దరూ వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్నా సరే.. ఇద్దరికీ నగరంలో నాలుగేండ్ల సర్వీసు పూర్తయితే కచ్చితంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆర్థిక శాఖ మెమోలో స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో స్పౌజ్ కేసులు పరిగణనలోకి తీసుకుని వారికి గ్రామీణ ప్రాంతాల్లో ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలని, స్పౌజ్ కేసు నిబంధనలు దుర్వినియోగం కాకుండా చూడాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.
దీంతో సాధారణ బదిలీలకు ఒక శాఖలో ఒక కేడర్‌లో 40 శాతానికి మించకుండా చూడాలనే నిబంధన విధించారు. దీనిపై అనేక శాఖలు సందేహాలు వ్యక్తం చేస్తుండగా.. ఇదే మెమోలో వివరణ ఉందని ఆర్థిక శాఖ తెలిపింది. ఉదాహరణకు.. ఒక శాఖలో ఒక కేడర్‌లో మొత్తం మంజూరైన పోస్టులు వంద ఉంటే.. వీటిలో 60 ఖాళీలున్నాయనుకోండి. మిగిలిన 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారనుకోండి. 40 శాతం నిబంధన కింద 40 మందిలో 16 మందిని మాత్రమే బదిలీ చేయాలని ఆర్థికశాఖ 2018 మెమోలోనే వివరణ ఇచ్చింది. దానినే ఇప్పుడు కచ్చితంగా అమలుచేయాలని, మొత్తం పనిచేస్తున్న 40 మందిని బదిలీచేయడానికి వీల్లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
డిప్యుటేషన్నూ 4 ఏండ్ల సర్వీసుగా పరిగణించాల్సిందే
పలువురు ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్ పోస్టులో ఉంటూ డిప్యుటేషన్‌పై వచ్చి నగరంలో పనిచేస్తున్నారు. సాధారణ బదిలీకి గ్రామీణ ప్రాంతంలోని రెగ్యులర్ సర్వీసును మాత్రమే పరిగణనలోకి తీసుకుని, ఇప్పుడు నగరంలో పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. పైగా వీరి తరఫున వారి జీవిత భాగస్వామి కూడా స్పౌజ్ కేసు నిబంధన కింద నగరానికి బదిలీ అడుగుతున్నారు. డిప్యుటేషన్ పై ఎక్కడ నాలుగేండ్లపాటు పనిచేసినా దానిని కూడా అక్కడ పనిచేసినట్టుగానే పూర్తి సర్వీసుగా పరిగణించి, సదరు ఉద్యోగికి అదే ప్రాంతంలో మళ్లీ సాధారణ బదిలీ కింద పోస్టింగు ఇవ్వవద్దని ఆర్థికశాఖ మెమోలో క్లారిటీ ఇచ్చింది.