పోలీస్​ ఆఫీసర్లతో లీడర్ల బది‘లీలలు’

  • పోలీస్​ ఆఫీసర్లతో లీడర్ల బది‘లీలలు’
  • బోధన్​లో ఉత్కంఠ రేపుతున్న  ఏసీపీ కిరణ్​కుమార్​ ట్రాన్స్​ఫర్​
  • రిలీవ్​ కాకముందే చార్జి తీసుకున్న విజయ్​ సారథి
  •  కిరణ్​​ ట్రాన్స్​ఫర్​ కాకుండా ఓ లీడర్​ అభయం
  • పై స్థాయిలో చక్రం తిప్పి విజయ​సారథిని బోధన్​ తెచ్చిన మరో లీడర్​
  • హైదరాబాద్​లో మకాం వేసి  పైరవీలు చేస్తున్న ఇద్దరు ఏసీపీలు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లాలో బోధన్​ఏసీపీ కేఎం కిరణ్​కుమార్​అనూహ్య బదిలీ ఉత్కంఠ రేపుతున్నది. కిరణ్​కుమార్​ రిలీవ్​ కాకముందే ఆయన లేని టైంలో ఆగమేఘాలపై వచ్చిన జే విజయ్​ సారథి ఏసీపీగా చార్జి తీసుకున్నారు.  ‘ఎన్నికలయ్యేదాకా బోధన్ లోనే ఉంటావు.. నీ పని నువ్వు చేసుకో’ అని కిరణ్​కుమార్​కు ఓ లీడర్​ అభయమిస్తే , మరో లీడర్​కిరణ్​కుమార్​ను ట్రాన్స్​ఫర్​ చేయించడం నిజామాబాద్​ రాజకీయాల్లో కాక రేపుతున్నది. ఈసీ  నిబంధనల ప్రకారం ఒక జిల్లాలో మూడేండ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా ట్రాన్స్​ఫర్​ చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఏడాదిన్నర మాత్రమే విధులు నిర్వహించిన కిరణ్​ను ఎందుకు ట్రాన్స్​ఫర్​ చేయించారనేది చర్చనీయాంశంగా మారింది. దీంతో తన ట్రాన్స్​ఫర్​ను క్యాన్సిల్​ చేయించుకునేందుకు ఏసీపీ కిరణ్​కుమార్, తన ట్రాన్స్​ఫర్​ను ఓకే చేయించుకునేందుకు విజయ్​ సారథి ఇద్దరూ హైదరాబాద్​లో మకాం వేసి తమ గాడ్​ఫాదర్ల ద్వారా పైరవీలు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఎలక్షన్ బదిలీలు రాజకీయ నాయకులు తమ స్వార్థానికి ఎలా వాడుకుంటున్నారనేందుకు ఈ ఉదంతం నిదర్శనంగా మారింది. 

అంతా ఆగమేఘాలపైనే.. 

కిరణ్​కుమార్​2022 ఆగస్టులో బోధన్​ఏసీపీగా వచ్చారు. అంతకు ముందు కొంత కాలం నిజామాబాద్ ​సీసీఆర్​బీలో డీఎస్పీగా పని చేశారు. రెండుచోట్లా కలిపి ఆయన జిల్లాలో ఆయన డ్యూటీ చేసింది ఏడాదిన్నర మాత్రమే. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక జిల్లాలో మూడేండ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని, జిల్లా స్థానికత ఉన్న ఆఫీసర్లను సర్కారు కచ్చితంగా ట్రాన్స్​ఫర్​ చేసి ఎలక్షన్​ కమిషన్​కు రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఎన్నికలు ముగిసేదాకా బదిలీ ఉండదనే ధీమాతో ఉన్న కిరణ్ ​పర్సనల్ ​పనిపై ఇటీవల మూడు రోజులు లీవ్​లో వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో కిరణ్​ను ట్రాన్స్​ఫర్​ చేసి హైదరాబాద్​లో రిపోర్ట్​ చేయాలని పై నుంచి ఆర్డర్స్​ వచ్చాయి. 

రెండురోజుల తర్వాత నిజామాబాద్​ సీసీఎస్​ డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కిరణ్​ లీవ్​పై వెళ్లిన రోజే  డీజీ కార్యాలయం నుంచి విజయ్​ సారథిట్రాన్స్​ఫర్​పై వచ్చి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూలై 27న ఏసీపీగా జాయిన్ ​అయ్యారు. ప్రస్తుతం ఉన్న సంప్రదాయం ప్రకారం ట్రాన్స్​ఫర్​ అయిన ఆఫీసర్​ రిలీవ్​ అయ్యాకే కొత్త ఆఫీసర్​ చార్జ్​ తీసుకోవాలి. కానీ,కిరణ్​కుమార్ ​రిలీవ్ ​కాకముందే విజయ్​ సారథి జాయిన్​ కావడం వివాదాస్పదమైంది. మరోవైపు ఏసీపీ క్యాంపు ఆఫీసు తాళాలు, గవర్నమెంటు ఇన్నోవా కారు, అఫీషియల్ ​సిమ్​కార్డు ఇప్పటికీ కిరణ్​వద్దే ఉన్నాయి. కాగా, సొంత కారులో వచ్చి జాయిన్​ అయిన విజయ్​ సారథి క్యాంపు ఆఫీసులోని ఒక రూమ్​లో నిద్రించి మరో గదిలోని ఆఫీస్​ఛాంబర్​లో కూర్చొని ఫైల్స్​ చూశారు.  అయిదు రోజుల డ్యూటీ తర్వాత లీవ్​పెట్టి ట్రాన్స్​ఫర్​ కన్ఫామ్​చేసుకోవడానికి హైదరాబాద్​ వెళ్లారు.  మరోవైపు కిరణ్​కుమార్​ సైతం తన ట్రాన్స్​ఫర్​ ఆపేందుకు హైదరాబాద్​లోనే మకాం వేసి తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. 

ఇంతకీ ఏం జరిగింది? 

మార్చి నెలాఖరున నిజామాబాద్ పోలీస్​ కమిషనర్​ కేఆర్ నాగరాజు​ రిటైర్ అయ్యారు. ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రెగ్యూలర్​ఆఫీసర్​ని ఇప్పటికీ నియమించలేదు. మూడు అడిషనల్​ కమిషనర్​ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. పెద్దాఫీసర్లు లేకపోవడంతో కింది ఆఫీసర్ల ఇష్టారాజ్యంగా మారింది. నిజానికి ఎన్నికలు ముగిసేదాకా బోధన్​లోనే ఉండేలా ఏసీపీ కిరణ్​కు స్పీకర్​ పోచారం అభయమిచ్చినట్లు తెలిసింది. కానీ, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి పైరవీతో విజయ్​ సారథి బోధన్​కు ట్రాన్స్​ఫర్​ అయినట్లు పోలీస్​వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

పొలిటికల్​ సర్కిల్స్​లో మరో టాక్​ నడుస్తున్నది. బోధన్​ఎమ్మెల్యే షకీల్​కు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్న ఓ లీడర్​,  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ​టికెట్ ఆశిస్తున్నారు. ఇందుకోసం కవిత దగ్గర పైరవీలు చేస్తున్న సదరు నేత  తనకు అనుకూలంగా ఉండే విజయ్​ సారథి పైస్థాయిలో చక్రం తిప్పి ఇక్కడికి ట్రాన్స్​ఫర్​ చేయించినట్లు చెప్తున్నారు.  మొత్తం మీద రాజకీయ నాయకుల పుణ్యమా అని ప్రస్తుతానికి బోధన్​ ఇద్దరు ఏసీపీల డివిజన్​గా మారింది.