త్వరలో అధికారుల బదిలీలు!

త్వరలో అధికారుల బదిలీలు!
  • ఎన్నికల కోడ్ ముగియడంతో అధికారుల ట్రాన్స్​ఫర్లపై సర్కార్ కసరత్తు
  • లిస్టులో వివిధ శాఖల హెచ్​వోడీలు, కలెక్టర్లు, ఎస్పీలు   
  • సీఎంవోలోనూ మార్పులు.. ఇద్దరు ఐఏఎస్​లకు చాన్స్ 
  • సీఎస్, డీజీపీనీ మారుస్తారంటూ చర్చ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అధికారుల బదిలీలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఉన్నతాధికారులు మొదలు మండల స్థాయి అధికారుల వరకు ట్రాన్స్​ఫర్లపై కసరత్తు చేస్తున్నది. లోక్​సభ ఎన్నికల కోడ్ ముగియడం, ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు పూర్తవుతుండడంతో పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మరింత ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే వివిధ శాఖల హెచ్​వోడీలు, కలెక్టర్లు, ఎస్పీలను మార్చనున్నట్టు తెలిసింది. సీఎం కార్యాలయంలోనూ మార్పులు ఉంటాయని తెలుస్తున్నది. సీఎస్, డీజీపీని కూడా మారుస్తారంటూ చర్చ జరుగుతున్నది.

నాలుగైదు రోజుల్లోనే ట్రాన్స్​ఫర్లు ఉండే చాన్స్ ఉందని సెక్రటేరియెట్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు ఐఏఎస్​లను సీఎంవోలోకి తీసుకునే అవకాశం ఉందని, ఇప్పుడున్న వారిలో ఒకరిద్దరిని మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఇక లోక్ సభ ఎన్నికలు ముగియడంతో సీఈవో వికాస్ రాజ్​ను ప్రభుత్వంలోకి తీసుకోనున్నారు. అడిషనల్​సీఈవో లోకేశ్ కుమార్​ను సీఎంవోలోకి తీసుకునేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నదని తెలిసింది. ఈ మేరకు లోకేశ్ కుమార్​ను రిలీవ్​చేయాలని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లేఖ రాసింది. 

పనితీరు ఆధారంగా ట్రాన్స్​ఫర్లు..  

అధికారుల పనితీరు ఆధారంగానే బదిలీలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐటీ డిపార్ట్ మెంట్​కు సర్ఫారాజ్ ​పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఆర్​అండ్​ బీకి ప్రిన్సిపల్​ సెక్రటరీగా ఉన్న శ్రీనివాసరాజు స్థానంలో విజయేంద్ర బోయికి ఇటీవల అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ శాఖకు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించనున్నారు. ఇటీవల కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ ​శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ రిటైర్ అయ్యారు. ఈ శాఖను రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్​కు అప్పగించడమా? లేక ఇంకొకరికి ఇవ్వడమా? అనే దానిపై కసరత్తు జరుగుతున్నది. ఫైనాన్స్ ​డిపార్ట్​మెంట్​తో పాటు బీసీ వెల్ఫేర్ ​శాఖల హెచ్​వోడీల్లోనూ మార్పులు ఉంటాయని చర్చ జరుగుతున్నది.

ఎడ్యుకేషన్ ​ప్రిన్సిపల్ ​సెక్రటరీ బుర్రా వెంకటేశం, మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్​అర్బన్ డెవలప్​మెంట్ ప్రిన్సిపల్ ​సెక్రటరీ దాన కిశోర్​ను కూడా మార్చే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ సెక్రటరీ రిజ్వీ ఎంసీహెచ్​ఆర్డీ లేదా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పోస్టుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్​ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, ఎక్సైజ్​ కమిషనర్ శ్రీధర్​లను మార్చనున్నట్టు సమాచారం. వీరి పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది.  

జిల్లాల్లోనూ భారీగా బదిలీలు.. 

జిల్లాల్లోనూ భారీగా బదిలీలు జరగనున్నాయి. ఇప్పుడున్న కలెక్టర్లలో చాలామంది ఈసీ ఆదేశాలకు అనుగుణంగా వచ్చినవారే ఉన్నారు. మరికొంత మంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి కొనసాగుతున్నారు. దీంతో జిల్లా కలెక్టర్లలోనూ మార్పుచేర్పులు ఉండనున్నాయి. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు మంచి కలెక్టర్లను ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సిఫార్సులు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఐపీఎస్​లలోనూ భారీగా ట్రాన్స్​ఫర్లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ కమిషనరేట్లతో పాటు ఎస్పీలను ప్రభుత్వం మార్చనున్నట్టు తెలిసింది.

డీసీపీ, ఏసీపీ, డీఎస్పీ, సీఐ, ఎస్సైల ట్రాన్స్​ఫర్లు జరగనున్నాయి. మరోవైపు జిల్లా స్థాయిలో రెవెన్యూ విభాగంలో బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు. టీచర్ల ట్రాన్స్​ఫర్లకు కూడా కసరత్తు మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో బదిలీ అయిన ఎమ్మార్వోలను తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నది. 

సీఎస్​ను మారుస్తరా? 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని మారుస్తారంటూ చర్చ జరుగుతున్నది. సీఎస్​గా ఎంసీహెచ్​ఆర్డీ డీజీ శశాంక్​గోయల్ లేదంటే, ప్రస్తుత సీఈవో వికాస్​రాజ్​ను నియమించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సీఎస్ శాంతికుమారి ప్రభుత్వ కార్యక్రమాలను సక్సెస్​ఫుల్​గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలాంటి వివాదాల్లో తలదూర్చరనే పేరుంది. ఇక డీజీపీ రవిగుప్తా ఈసీ ఆదేశాలతో ఆ పోస్టులోకి వచ్చారు. ఆయనను కొంతకాలం కంటిన్యూ చేస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది.

ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు రాకుండా డీజీపీ రవిగుప్తా చూసుకున్నారు. ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతల విషయంలో తక్కువ టైమ్​లోనే మంచిపేరు తెచ్చుకున్నారు. దీంతో డీజీపీ మార్పు ఉండకపోవచ్చని తెలుస్తున్నది. ఒకవేళ మారిస్తే హోం శాఖ ప్రిన్సిపల్ ​సెక్రటరీ జితేందర్​కు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.