ఉప ఎన్నిక నేపథ్యంలో తహసీల్దార్లకు స్థానచలనం

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బదిలీల పర్వం మొదలైంది. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తాహసీల్దార్లకు స్థాన చలనం కల్పిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ కేంద్రం మునుగోడు తహసీల్దార్ జక్కర్తి  శ్రీనివాసులును చిట్యాలకు బదిలీ చేసింది. ఈయన స్థానంలో చిట్యాలలో పనిచేస్తున్న తహసీల్దార్ కృష్ణా రెడ్డిని మునుగోడు తహసీల్దార్ గా నియమించింది. అలాగే చండూరు తహశీల్దార్ మహేందర్ రెడ్డిని కొండమల్లేపల్లికి బదిలీ చేసి కొండమల్లేపల్లి తహశీల్దార్ గణేష్ ను  చండూర్ కి బదిలీ చేసింది. 
 ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ప్రక్రియ ముమ్మరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు భారీగా ఓటుకు 10వేల రూపాయలు చొప్పున పంచుతారని  ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మునుగోడులో ఓటరు నమోదు కోసం చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి ఓటు బదిలీ దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాగే 18 ఏళ్లు నిండిన స్థానిక యువత కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎగబడుతున్నారు.