- ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ వంటి టెక్నాలజీలపై భారీ పెట్టుబడి
- రియల్‌టైమ్‌లో ఇన్వెంటరీని చెక్ చేసుకోవడానికి సిమెంట్, ఇండస్ట్రియల్ గూడ్స్ సెక్టార్లు ప్రాధాన్యం
- కొత్త టెక్‌లతో కంపెనీల రెవెన్యూ సగటున 7 శాతం పెరుగుతుందని అంచనా
న్యూఢిల్లీ: ఇండియన్ తయారీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ వంటి కొత్త తరం టెక్నాలజీలకు షిఫ్ట్ అవుతున్నాయి. వీటితో రెవెన్యూ పెరుగుతుందని భావిస్తున్నాయి. కన్సల్టింగ్ కంపెనీ పీడబ్ల్యూసీ తాజా రిపోర్ట్ ప్రకారం, దేశంలోని 93 శాతం మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి, సస్టయినబుల్ విధానాలను ఫాలో కావడానికి కొత్త టెక్నాలజీలను వాడుతున్నాయి. ఆరు ఇండస్ట్రీలలోని కంపెనీలను ఈ ఏడాది మే, జులైలో రీసెర్చ్ చేసి ఈ రిపోర్ట్‌ను పీడబ్ల్యూసీ రెడీ చేసింది.
ఆటోమోటివ్, సిమెంట్, కెమికల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్, మెటల్స్, టెక్స్‌టైల్స్ అండ్ క్లాతింగ్ ఇండస్ట్రీలలోని కంపెనీలు, ఎగ్జిక్యూటివ్‌ల నుంచి అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, 50 శాతం కంపెనీలు రెన్యూవబుల్ ఎనర్జీపై, కరెంట్‌ను సమర్థవంతంగా వాడడంపై ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నాయి. ఇందుకోసం డిజిటల్ టెక్నాలజీలను వాడుతున్నామని వివరించాయి. టాప్ కంపెనీల్లోని 52 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగుల స్కిల్స్ పెంచడానికి కొత్త విధానాలపై ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు.
ఇండస్ట్రీ 5.0 ఇది..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు, మనుషుల మధ్య సంబంధాన్ని ఇండస్ట్రీ 5.0 తెలుపుతోందని పీడబ్ల్యూసీ ఇండియా పార్టనర్ సుదీప్తా ఘోష్ అన్నారు. ఈ టెక్నాలజీలను వాడడం మొదలు పెట్టిన కంపెనీలు మిగిలిన కంపెనీలతో పోలిస్తే బెటర్ పొజిషన్‌లో ఉంటాయని పేర్కొన్నారు. కొన్ని సెక్టార్లలోని కంపెనీలు కొత్త తరం టెక్నాలజీలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సిమెంట్, ఇండస్ట్రియల్ గూడ్స్ సెక్టార్లలోని 95 శాతం కంపెనీలు రియల్‌టైమ్ ఇన్వెంటరీ ట్రాకింగ్‌పై భారీగా పెట్టుబడి పెడుతున్నాయి.
ఇన్వెంటరీ లెవెల్స్‌ను చెక్ చేయడానికి, ఎక్కువగా ఉండే నిల్వలను తగ్గించుకోవడానికి వీలు కల్పించే టెక్నాలజీపై ఈ పెట్టుబడులు పెడుతున్నాయి. పీడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం, చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఇండస్ట్రీ 5.0 కి మారడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. కస్టమర్ సర్వీస్, వర్క్‌ఫోర్స్, సప్లయ్ చెయిన్, బిజినెస్ మోడల్స్, ఈఎస్‌టీ కమిట్‌మెంట్స్‌లో కొత్త తరం టెక్నాలజీలను వాడడం ద్వారా తమ కంపెనీల రెవెన్యూ రానున్న రెండేళ్లలో సగటున 6.42 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇండస్ట్రీ 5.0 కి మారడంతో ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చని కెమికల్స్, సిమెంట్, టెక్స్‌టైల్స్ అండ్ క్లాతింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడుతున్నారు.
తమ కంపెనీల రెవెన్యూ సగటున 7 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తమ కస్టమర్లు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌లు, సర్వీస్‌ల కోసం అదనంగా ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారని ఆటోమోటివ్, మెటల్స్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు వెల్లడించారు. టెక్స్‌టైల్స్ అండ్ క్లాతింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు మాత్రం తమ కస్టమర్లు సస్టయినబుల్ ప్రొడక్ట్‌ల కోసం అదనంగా ఖర్చు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.