- అంజలీ హత్య కేసులో ట్రాన్స్‌జెండర్ మహేశ్వరి అరెస్టు
కోల్‌బెల్ట్,వెలుగు: మందమర్రి మండలం గుడిపెల్లి అటవీప్రాంతంలో యువతి సల్లూరి అంజలిని హత్య చేసిన పెరుగు గున్నక్క అలియాస్ మహేశ్వరిని మంగళవారం రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి, రామకృష్ణాపూర్ టౌన్ ఎస్సై బి.అశోక్ వివరాలు వెల్లడించారు. మామిడిగట్టు గ్రామానికి చెందిన అంజలి, నెన్నెల మండలం మన్నెగూడకు చెందిన పెరుగు మహేశ్వరి రెండేండ్లుగా మంచిర్యాలలోని విద్యానగర్‌లో ఒకే రూమ్‌లో ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి మగవాళ్లలా వ్యవవహరించిన ట్రాన్స్ జెండర్ మహేశ్వరి కొద్దికాలంగా అంజలిని ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుందామంటూ ఒత్తిడి తేగా, ఆమె ఒప్పుకోలేదు. పెళ్లి వద్దని, దోస్తులుగా ఉందామనడంతో తరచూ ఇద్దరు గొడవపడేవారు. వీరి రూమ్‌కు మహేశ్వరి స్నేహితుడు ఆజ్మీర శ్రీనివాస్ తరచూ వచ్చేవాడు. అంజలి, శ్రీనివాస్ మధ్య చనువు పెరిగింది. తాను శ్రీనివాస్‌ను పెండ్లి చేసుకుంటానని అంజలి చెప్పడంతో కోపం పెంచుకున్న మహేశ్వరి ఆమెను చంపాలని నిర్ణయించుకుంది. ఈ నెల 15న రాత్రి తన బైక్‌పై గుడిపెల్లి గ్రామం వైపు తీసుకవెళ్లింది. రాత్రి 10 గంటలకు మహేశ్వరి తనతో తెచ్చుకున్న కత్తితో అంజలిపై దాడి చేసి చంపింది. తనపై అనుమానం రాకుండా అదే కత్తితో గొంతు, కడుపులో పొడుచు కుందని సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ అశోక్ తెలిపారు.