- హోమ్‌గార్డ్ తరహాలో వారికి విధులు: సీఎం రేవంత్
- ఇండోర్‌లా గ్రేటర్ హైదరాబాద్
- చెత్త సేకరణకు జీఐఎస్.. క్యూఆర్ స్కాన్ పరిజ్ఞానం వినియోగించాలి
- మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి
- అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్ జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కార్పొరేషన్అధికారులు ఇండోర్ వెళ్లి అధ్యయనం చేసి రావాలని సూచించారు.
హైదరాబాద్ అభివృద్ధితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇండోర్ సిటీలో అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించి రావాలని అధికారులకు సూచించారు.
ఏయే ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు అక్కడ చెత్త సేకరణలో పాలుపంచుకుంటున్నాయో తెలుసుకొని.. వారితో చర్చించాలని, వీలైతే వారిని భాగస్వాములను చేయాలన్నారు. క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఇండోర్ కార్పొరేషన్ ఆదాయ వనరులను ఎలా సమీకరిస్తున్నది? అనే వివరాలు కూడా తెలుసుకోవాలన్నారు.
హైదరాబాద్ లో అయిదేండ్ల కింద కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద 811 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారని, వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏడాది డిసెంబర్ తో కాంట్రాక్టు గడువు ముగిసిపోతుందని, అందుకే రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని అన్నారు. గడువులోగా అన్ని రోడ్ల పనులను పర్యవేక్షించి, వెంటనే బాగు చేయించాలని ఆదేశించారు.
పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి తనకు 15 రోజుల్లోగా పూర్తి నివేదికను అందించాలని, తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
హోంగార్డ్స్తరహాలో ట్రాన్స్‌జెండర్స్‌కు విధులు
హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతోపాటు హోమ్ గార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని సీఎం సూచించారు.
ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుందన్నారు. ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. వారం, పది రోజులపాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలన్నారు. విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండేలా చూడాలని చెప్పారు.
రోడ్లతోపాటు చెత్త సేకరణపై జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అవసరమైతే జీఐఎస్, క్యూఆర్ స్కాన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు.
మూసీ నిర్వాసితులకు అన్యాయం జరగొద్దు
మూసీరివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతంలో సేకరించే స్థలాల్లో ఉన్న నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ఎక్కడా తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధ పడకుండా, వారికి భరోసా కల్పించాలన్నారు.
చర్లపల్లి రైల్వేస్టేషన్ అధునీకరిస్తున్నందున, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.