గురుకులాల్లో పారదర్శకంగా సీట్ల కేటాయింపు: అలుగు వర్షిణి

గురుకులాల్లో పారదర్శకంగా సీట్ల కేటాయింపు: అలుగు వర్షిణి

హైదరాబాద్ ,వెలుగు: గురుకుల సీట్ల కేటాయింపు మెరిట్ ప్రకారం పారదర్శకంగా కేటాయిస్తామని గురుకుల ఎంట్రన్స్ సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో పెద్ద ఎత్తున సీట్లు ఉన్నాయని, ఏ స్టూడెంట్‌‌కు అన్యాయం జరగదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల సీట్ల కేటాయింపులో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో సీట్లు కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తలను, సోషల్ మీడియా ప్రచారాలను స్టూడెంట్స్, తల్లిదండ్రులు నమ్మొద్దని సూచించారు. 

స్టేట్‌‌ యూనిట్‌‌గా తీసుకొని సీట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. గురుకులాల్లో ఇప్పటికే ఫేజ్1 సీట్ల కేటాయింపు జరగగా, త్వరలో ఫేజ్2లో సీట్లను భర్తీ చేస్తామని చెప్పారు. ఒక జిల్లాలో పర్టిక్యులర్ కేటగిరీలో సీట్లు కేటాయించటానికి స్టూడెంట్స్ లేకపోతే పక్క జిల్లా విద్యార్థులకు సీట్లు కేటాయించామని సెక్రటరీ పేర్కొన్నారు. 

సీట్ల కేటాయింపు తర్వాత దివ్యాంగులు, ఆర్ఫాన్స్, ఫిషర్‌‌‌‌మెన్, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, ఏజెన్సీ, ఎంబీసీ కేటగిరీల స్టూడెంట్స్‌‌కు 4 వేల సీట్లు కేటాయించామని, ఈ సీట్లు భర్తీ కాకపోతే మెరిట్ ఉన్న అభ్యర్థులకు సొంత జిల్లాలో కేటాయిస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో మైనారిటీలకు కేటాయించే సీట్లు కూడా ఖాళీగా ఉంటే అందులో కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. డబ్బులిస్తే గురుకులాల్లో సీట్లు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలు నమ్మొద్దని ఆమె సూచించారు.