- త్వరలో సర్వేయర్లు, వీఆర్వోల నయామకం
- అధికారులతో హౌసింగ్, రెవెన్యూ మంత్రి రివ్యూ
- స్కీమ్ అమలుకు మరో 400 మంది ఇంజనీర్లు కావాలన్న అధికారులు
- ఇతర శాఖల ఇంజనీర్లను వినియోగించుకోవాలన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టులను గ్రామ సభల్లో డిస్ ప్లే చేస్తామని, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హౌసింగ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకంపై శుక్రవారం సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాశ్, హౌసింగ్ కార్పొ రేషన్ ఎండీ వీపీ గౌతమ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తితో మంత్రి రివ్యూ చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో ఇంటి జాగా ఉన్నవారి జాబితా, జాగా లేని వారి జాబితాలను గ్రామసభల్లో పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్‌లో 274 మంది ఇంజనీర్లు మాత్రమే ఉన్నారని.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పర్యవేక్షణకు మరో 400 మంది ఇంజనీర్లు అవసరమని ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఇతర శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
జీహెచ్ఎంసీలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని.. ఇందుకోసం వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలన్నారు. ఈ పరీక్షకు విధివిధానాలను రూపొందించి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు ఉన్నారని, అదనంగా మరో వెయ్యిమంది సర్వేయర్లు అవసరమున్న నేపథ్యంలో పారదర్శకంగా ఎంపికకు చర్యలు చేపట్టాలన్నారు.