- రెండేండ్లుగా ట్రాన్స్ పోర్టు కిరాయి ఇవ్వని గత సర్కార్
- ట్రాన్స్‌పోర్టు పేర ఎంఈవోల జేబులకు చిల్లు
భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం, వెలుగు : ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ను ఎలా తీసుకెళ్లాలని ఎంఈవోలు తలలు పట్టుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్లుగా ట్రాన్స్‌పోర్టు కిరాయి చెల్లించలేదు. ఒక్కో ఎంఈవోకు దాదాపు రూ.40 వేల నుంచి రూ. లక్ష వరకు బకాయి పడింది. రెండేండ్లుగా పాఠ్యపుస్తకాలను తీసుకెళ్లేందుకు ఎంఈవోలే సొంతంగా డబ్బులు పెట్టుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
టెక్స్ట్, నోట్ బుక్స్జిల్లా కేంద్రం నుంచి మండలాలకు, అక్కడి నుంచి స్కూల్‌కు తీసుకెళ్లేందుకు అవసరమైన ట్రాన్స్ పోర్టు చార్జీలను ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈవోలు కోరుతున్నారు. లేకపోతే ప్రస్తుతం జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ ఏడాది ఒక్కో ఎంఈవోకు ట్రాన్స్ పోర్ట్ కిరాయి కోసం రూ.10వేల వరకు అడ్వాన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు.
ఏ జిల్లాలో.. ఎన్ని బుక్స్..
స్కూల్స్ ప్రారంభం రోజునే స్టూడెంట్స్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో జిల్లా కేంద్రాలకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ చేరుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 2,66,458 నోట్ బుక్స్ అవసరం కాగా, నూరు శాతం నోట్ బుక్స్ ఇప్పటికే జిల్లా కేంద్రంలోని గోడౌన్‌కు చేరుకున్నాయి. 5.17లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, ఇందులో ఇప్పటికే దాదాపు 4,17,333 జిల్లాకు వచ్చేశాయి. ఖమ్మం జిల్లాకు 6,84,740 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, 3.20 లక్షల పాఠ్య పుస్తకాలు, 80 వేల వరకు నోట్ బుక్స్ జిల్లాకు చేరుకున్నాయి.
స్కూల్స్ రీ ఓపెన్ లోపు బుక్స్ వస్తయ్..
స్కూల్స్ ప్రారంభం అయ్యే నాటికి బడుల్లో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు చేపట్టాం. జూన్ మొదటి వారంలోపు మండల కేంద్రాలకు బుక్స్ చేరుకుంటాయి. అక్కడి నుంచి స్కూళ్లకు హెడ్మాస్టర్లు తీసుకెళ్తారు. ట్రాన్స్ పోర్టు చార్జీల బకాయిలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించనున్నాం. ఈ సారి త్వరగానే ట్రాన్స్ పోర్టు డబ్బులు వచ్చే అవకాశం ఉంది.
– వెంకటేశ్వరాచారి, డీఈవో, భద్రాద్రికొత్తగూడెం