
- లైఫ్ టాక్స్ ఫ్రీతో ఈ ఏడాది టార్గెట్ కు గండి
- మొత్తం లక్ష్యం రూ.4500 కోట్లు.. వచ్చిన ఇన్ కం రూ.3800 కోట్లు
- ఫైన్ ల రూపంలో భర్తీ చేసే ప్రయత్నాల్లో అధికారులు
హైదరాబాద్, వెలుగు: ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను చేరుకునే రవాణా శాఖ.. ఈ ఏడాది మాత్రం దాన్ని అందుకోలేకపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు టాక్స్ ల రూపంలో రవాణా శాఖకు దాదాపుగా రూ.4,500 కోట్ల ఆదాయం సమకూరాల్సి ఉంది. మరో నెలన్నరలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఇప్పటి వరకు రవాణా శాఖకు సుమారు రూ.3,800 కోట్ల ఆదాయం సమాకూరినట్లు సమాచారం. మిగిలిన 45 రోజుల్లో మరో రూ.700 కోట్ల ఆదాయం సమకూరితేనే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను అందుకున్నట్లు అవుతుంది. దీంతో లక్ష్యాన్ని చేరుకోవడానికి రవాణా శాఖ అధికారులు నానా తంటాలు పడుతున్నారు.
ఈ ఏడాది టార్గెట్ ను అందుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ వెహికిల్స్ (ఈవీ) అని అధికారులు చెప్తున్నారు. గత ఏడాది నవంబరు నుంచి ఈవీలకు లైఫ్ టాక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రవాణా శాఖ ఆదాయానికి కొంత వరకు గండి కొట్టినట్లయింది. ఈ నాలుగు నెలల కాలంలోనే ఈవీల కొనుగోళ్లపై జనం ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద మొత్తంలో టూ వీలర్లు, త్రీ వీలర్లు (ఆటోలు), లైట్ మోటర్ వెహికిల్స్ కార్లను జనం కొనుగోలు చేస్తున్నారు. ఈవీల కొనుగోళ్లు పెరగడం, లైఫ్ టాక్స్ రాకపోవడంతో రవాణా శాఖ తన టార్గెట్ ను రీచ్ కాలేకపోతున్నదని ఓ అధికారి చెప్పారు.
ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో కొంత స్తబ్దత నెలకొనడం కూడా మరో కారణమని ఆర్టీఏ అధికారులు అంటున్నారు. హైడ్రా రంగప్రవేశంతో శివారు భూముల విక్రయాల్లో కొంత ఊపు తగ్గడం కూడా కొత్త వాహనాల కొనుగోళ్లపై ప్రభావం పడిందని చెప్తున్నారు. రవాణా శాఖకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఆదాయంలో దాదాపు 70 శాతం వరకు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసుల ద్వారానే సమకూరుతోంది. రియల్ ఎస్టేట్ రంగానికి పెద్దదిక్కు ప్రధానంగా రంగారెడ్డి ఉమ్మడి జిల్లానే. దీంతో ఈ జిల్లా పరిధిలోని ఆర్టీఏ ఆఫీసుల్లో ఆదాయం బాగా పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం మరో 45 రోజుల్లో ముగియనుండడంతో టార్గెట్ ను చేరుకోవడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఫైన్ ల రూపంలో కొంతైనా రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు.