- ట్రాన్స్పోర్ట్ లారీలు లేక నిలిచిన రేషన్ సరఫరా
- 4 రోజుల తర్వాతే షాపులకు బియ్యం అలాట్ చేసే అవకాశం
మహబూబ్‌నగర్, వెలుగు: సివిల్‌సప్లయ్ గోదాముల్లో స్టాక్ అయిపోయింది. స్టాక్ లేకపోవడంతో పాటు బఫర్ గోదామ్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్‌కు, అక్కడి నుంచి షాపులకు బియ్యం ట్రాన్స్పోర్ట్ చేసే లారీలు రాక ఈ సమస్య ఉత్పన్నమైంది. 10 రోజులుగా రేషన్ షాపులకు రావాల్సిన బియ్యం ఆగిపోవడంతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.మహబూబ్‌నగర్ జిల్లాలో 506 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,39,730 రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులున్నాయి. వీటి ద్వారా ప్రతినెలా 42,00,988 మెట్రిక్‌టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మే 12 దాటినా ఇంత వరకు షాపులకు బియ్యం చేరలేదు.
మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి గత నెల 20 నుంచి షాపులకు బియ్యం స్టాక్సరఫరా ప్రారంభించాల్సి ఉంది. ఈ బియ్యాన్ని ఉమ్మడి జిల్లాలోని రైస్‌మిల్లుల నుంచి లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంది. అయితే ట్రాన్స్పోర్ట్ లారీలు రాక సఫ్లై ఆగినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. స్టాక్పాయింట్లలో అందుబాటులో ఉన్న వరకు బియ్యాన్ని జిల్లాలోని కొన్ని షాపులకు కేటాయించి, మిగతా వాటికి పెండింగ్ పెట్టారు. ఈ షాపులకు బియ్యం సఫ్లై చేయడానికి మరో వారం టైమ్ పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఒక్కరే..
ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల నుంచి స్టాక్‌ను లారీల్లో మిల్లులకు తరలించే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, రేషన్‌బియ్యం ట్రాన్స్పోర్ట్ చేసే లారీల కాంట్రాక్టర్ ఒక్కరే కావడంతో సమస్య ఏర్పడుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. సెంటర్ల నుంచి వడ్లను తరలించేందుకు 45 నుంచి 50 లారీలు, రేషన్‌బియ్యం టాన్స్పోర్ట్చేసేందుకు 12 లారీలకు అగ్రిమెంట్ఉన్నట్లు సివిల్సప్లయ్ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే జిల్లాలో ప్యాడి ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నందున లారీలు ఎక్కువగా కొనుగోలు సెంటర్ల వద్దే ఉంటున్నట్లు తెలిసింది.
బియ్యం జోకడంతో ఆలస్యం
ఆఫీసర్లు ఏప్రిల్ వరకు సంచుల లెక్కన బియ్యాన్ని రేషన్‌షాపులకు సప్లయ్ చేశారు. ఈ నెల నుంచి ప్రతీ డీలర్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు వెళ్లి బయోమెట్రిక్థంబ్ పెడితేనే, ఆ షాపుకు బియ్యం అలాట్అవుతుంది. తర్వాత లారీల్లో స్టాక్లోడ్చేసి షాపుల్లో దింపుతున్నారు. అది కూడా సంచుల లెక్కన కాకుండా గ్రామంలో ఎన్ని కార్డులున్నాయి? వాటికి బియ్యం కేటాయింపులు ఎంత? అని బియ్యం జోకిన తర్వాత లారీల్లోకి స్టాక్ ఎక్కిస్తున్నారు. ఈ ప్రాసెస్ కు ఎక్కువ సమయం పట్టడం వల్ల బియ్యం కేటాయింపుల్లో ఆలస్యం జరుగుతుందని డీలర్లు చెబుతున్నారు. గతంలో ప్రతీనెల 20వ తేదీ నుంచి షాపులకు బియ్యం కేటాయింపులు ప్రారంభించి, 1వ తేదీలోపు పూర్తి చేసే వారని, ఈ సారి 24వ తేదీన కేటాయింపులు ప్రారంభించారని, రెండు వారాలు కావొస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో 60% షాపులకు ఇంకా స్టాక్రాలేదని చెబుతున్నారు.
నాలుగు రోజుల్లో అన్ని షాపులకు అలాట్చేస్తాం
ప్రస్తుతం జిల్లాలో ప్యాడి ప్రొక్యూర్మెంట్జరుగుతోంది. ఈ ప్రాసెస్త్వరగా పూర్తి చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. దాంతో లారీలు ఎక్కువగా కొనుగోలు సెంటర్ల వద్దకు వెళ్లాయి. కాంట్రాక్టర్ ఒక్కరే కావడంతో ఆయనకు ఫోన్‌చేసి చెప్పాం. నాలుగు రోజుల్లో అన్ని షాపులకు బియ్యం తరలించాలని ఆదేశించాం. రేషన్‌లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. ఈ నెల 25 వరకు బియ్యం పంపిణీ చేస్తాం. డీలర్లకు కూడా ఈ విషయాన్ని చెప్పాం.
- బాలరాజు, డీఎస్ వో, మహబూబ్‌నగర్