తెలంగాణలో నూతన ఈవీ పాలసీ .. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు..

హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి (సోమవారం, నవంబర్ 18, 2024) నూతన ఈవీ పాలసీ అమల్లోకి తీసుకువస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానున్నట్లు తెలిపారు. గతంలో 2020--2030 ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చారని గుర్తుచేశారు. జీవో నెంబర్ 41 ద్వారా 2026, డిసెంబర్ 31 వరకు ఈ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అమల్లో ఉంటుందని వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, ఢిల్లీలా హైదరాబాద్‌లో కాలుష్యం సమస్య తలెత్తకూడదని చెప్పారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదని తెలిపారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు తెచ్చామని చెప్పారు. 

ALSO READ | కేటీఆర్​ అసహనంతో మాట్లాడుతుండు

ఎలక్ట్రిక్ బస్సులు కొన్నట్లైతే , కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర సంస్థల బస్సులకు 100 శాతం ట్యాక్స్ మినహాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్పై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని పొన్నం చెప్పారు. హైదరాబాద్లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. త్వరలోనే సిటీలో మొత్తం ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు నడుస్తాయని, అయితే అందుకు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇచ్చి భవిష్యత్ తరాలకు కాలుష్యం నుంచి కాపాడాలని మంత్రి కోరారు.