- అభివృద్ధిని ఓర్వలేక విమర్శలు చేస్తున్నరు
- కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిని బయటపెడ్తం
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
గోదావరిఖని, వెలుగు : బీజేపీ, బీఆర్‌ఎస్ లీడర్లు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలోని రాజూరాలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మంత్రి పొన్నంకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, ఆ పార్టీ లీడర్లు గోదావరిఖనిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీస్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా బీజేపీకి వత్తాసు పలుకుతుందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని కేటీఆర్ అంటున్నారంటే.. పరోక్షంగా బీజేపీకి ఓటు వేయమని చెపుతున్నట్లు స్పష్టం అవుతుందన్నారు. గత పదేండ్లుగా బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందన్న బీజేపీ.. బీజేపీ లీడర్లను ఎందుకు జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణ జరుగుతుందని, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.
ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని, ప్రజా విజయోత్సవాల పేరున ఈ నెల 19న వరంగల్‌లో మహిళా సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులతో పాటు, ప్రతిఒక్కరూ ఈ ఉత్సవాలకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మేయర్ బి.అనిల్‌కుమార్, లీడర్లు దీటి బాలరాజు, పాతపెల్లి ఎల్లయ్య, తిప్పారపు శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, మోహిద్ సన్నీ పాల్గొన్నారు.