- రోడ్డు భద్రతపై కఠినంగా వ్యవహరిస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా, మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను కఠినతరం చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో రోడ్డు భద్రతపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆదివారం లక్డీకపూల్ని ఓ హోటల్ లో రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్ రవీందర్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగ్గా పొన్నం చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు మరింత పెంచాలని రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి సూచించారు.
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ను అమలు చేస్తూ, మోటారు వాహనాల చట్టం –1988 కి అనుగుణంగా ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 6,936 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశామని పేర్కొన్నారు. రహదారి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రానున్న రోజుల్లో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రవాణా శాఖ నిబంధనలను అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలపై డిపార్ట్ మెంట్ ఉద్యోగులు, అధికారులు ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వివరించారు.
ఇందుకు అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించి ప్రమాదాల నివారణలో ఇతర రాష్ట్రాల కంటే ముందుండేలా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రవాణా శాఖ లో పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఇతర సమస్యలు పరిష్కరిస్తామన్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఎలాంటి వివాదాలు లేకుండా జరిపామని ఇది తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంవీ యాక్ట్ ను తెలంగాణలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్‌తో పాటు సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మార్గం రవీందర్, ఆర్టీవోలు, ఎంవీఐలు పాల్గొన్నారు.