- 80 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా చేర్చకున్నరు
- దళితులు సీఎల్పీ లీడర్ అయితే ఓర్వలేదు
- అప్పుడు రాజకీయ పునరేకీకరణ అన్నరు కదా
- బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై మా ప్రభుత్వాన్ని కూలగొడ్తమని బెదిరించిండ్రు
- మా మనోధైర్యం దెబ్బతీస్తె ఊకుంటమా
- బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలె
- కౌశిక్ రెడ్డి ఆంధ్రోళ్లపై మాట్లాడిన వీడియో కేటీఆర్ కు పంపుతం
- హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రలు సహించం
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్ఎస్ డాక్టరేట్ చేసిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 80 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారని గుర్తు చేశారు. ఒక దళితుడు సీఎల్పీ నేతల అయితే ఓర్చులేకే కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారని అన్నారు. అప్పడు రాజకీయ పునరేకీకరణ అంటూ కొత్త భాష్యం చెప్పారని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ ను జ్యోతిబాఫూలే ప్రజాభవన్ గా మార్చామని, ముళ్ల కంచెలు తొలగించామని, ప్రజాస్వామ్యయుత పాలన అందిస్తున్నామని అన్నారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసుకోనే అవకాశం ఇచ్చామని, కాళేశ్వరం సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఆటంకం కలిగించలేదని అన్నారు. వీటికి ఆకర్షితులై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు.
ALSO READ : ఎన్ని ఇబ్బందులు వచ్చినా రుణమాఫీ విషయంలో రాజీపడం
ఇప్పుడు తమ పార్టీలో చేరుతున్న వారిపై బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఆంధ్ర ప్రాంతం వారిని రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆంధ్రోళ్లపై ఆయన మాట్లడిన వీడియోను కేటీఆర్ కు పంపుతానని పొన్నం చెప్పారు. పాడి కౌశిక్ రెడ్డి చీర, గాజులు పంపి అవమానించారని అన్నారు. కేసీఆర్ కూడా ఆంధ్రా ప్రాంతం వారికి వ్యతిరేకంగా మాట్లాడారని అన్నారు. ‘మాది బిర్యానీ.. మీది పెండ అని అనలేదా... ’ అంటూ గుర్తు చేశారు. కలహాలు సృష్టించి హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజాప్రతినిధుల ఇండ్లపై దాడులు మంచి సంస్కృతి కాదని అన్నారు. కాంగ్రెస్ టాలెంటెడ్ పార్టీ అని, ఎవరూ చెప్పాల్సిన అవరం లేదని అన్నారు. పదేండ్లు పాలించిన వాళ్లు పది నెలలు కూడా ఓపిక పట్టడం లేదని, దానినే అసహనం అంటారని అన్నారు. సమావేశంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.