హైదరాబాద్ నగర ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..

హైదరాబాద్ నగర ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..

హైదరాబాద్: ఇంటి వ‌ద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ర‌వాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాక‌ర్ తెలిపారు. హైద‌రాబాద్లో పైల‌ట్ ప్రాజెక్ట్‌గా పార్శిళ్ల హోం డెలివ‌రీని రేప‌టి నుంచి (అక్టోబర్ 27, 2024) ప్రారంభించనున్నట్లు చెప్పారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు.

ప్రత్యామ్నయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్తరిస్తోందని, అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్లో వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆదివారం (ఈ నెల 27) నుంచి హైద‌రాబాద్లోని 31 ప్రాంతాల నుంచి  హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్లో ఎక్కడికైనా హోం డెలివ‌రీ చేయవచ్చని తెలిపారు.

ALSO READ | హైడ్రా ఐరన్ అమ్ముకోలే: బిల్డర్ ఆరోపణలపై కమిషనర్ రంగనాథ్ క్లారిటీ

రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజలు హోం డెలివ‌రీ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

పార్శిళ్ల హోం డెలివ‌రీ చార్జీలివే..
* 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50
* 1.01నుంచి 5 కేజీల‌కు రూ.60
* 5.01 నుంచి 10 కేజీల‌కు రూ.65
* 10.1 నుంచి 20 కేజీల‌కు రూ.70
*20.1 నుంచి 30 కేజీల‌కు రూ.75
*30.1 కేజీలు దాటితే పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధ‌ర‌లు ఉంటాయి.