ఆంధ్ర నుంచి తెలంగాణకు ఇసుక రవాణా

  • అక్రమంగా వందలాది లారీల్లో తరలింపు.. 

  • మూడు నెలలుగా కొనసాగుతున్న దందా

  • లారీలను అడ్డుకున్న బీజేపీ నేతలు 

  •  ఓవర్ లోడ్ తో వస్తున్న మూడు లారీలు సీజ్​


ఖమ్మం/మధిర, వెలుగు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఏకంగా ఏపీలోని నందిగామ నుంచి రోజూ వందకుపైగా లారీల్లో ఇసుక ఖమ్మం జిల్లాకు చేరుతోంది. నందిగామ దగ్గర మున్నేరు​నదిలో నుంచి తీసిన ఇసుకను మధిర, బోనకల్, చింతకాని మీదుగా ఖమ్మం తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా, ఓవర్​లోడ్ తో ప్రతి రోజూ రాత్రివేళల్లో గ్రామాల మీదుగా లారీలు వెళ్తున్నాయి. 25 టన్నుల నుంచి 35 టన్నుల కెపాసిటీతో ఉన్న లారీల్లో 50 నుంచి 51 టన్నుల వరకు లోడ్​చేసుకొని లారీలు వెళ్తున్నా పోలీసులు, రవాణాశాఖ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.20వేల నుంచి రూ.25 వేల చొప్పున తీసుకువస్తున్న లారీ ఇసుకను, ఖమ్మంలో రెట్టింపు రేటుకు అమ్ముతున్నారు. రెగ్యులర్​గా మామూళ్లు అందడం కారణంగానే ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 

హైవే నిర్మాణం కోసమని చెప్పి..

ఖమ్మం -–విజయవాడ హైవే నిర్మాణం కోసం ఉపయోగిస్తామనే కారణాన్ని చూపిస్తూ ఖమ్మంలో ఇసుకను అమ్ముకుంటున్నారని తెలిసింది. ఆంధ్ర నుంచి మధిర మీదుగా అక్రమంగా తరలి వెళుతున్న మూడు ఇసుక లారీలను బుధవారం రాత్రి ఆత్కూరు వద్ద బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ స్థానిక నాయకులకు సంఘీభావంగా లారీల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుంచే జిల్లా కలెక్టర్​కు, రవాణాశాఖ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అధిక బరువు, అధిక స్పీడ్​తో ప్రతిరోజు మధిర మీదుగా ఇసుక లారీలు తరలి వెళుతున్నాయని చెప్పారు. జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ కిషన్ రావు అక్కడికి చేరుకొని లారీలను సీజ్ చేశారు. వాటిని వే బ్రిడ్జి కాంటా వేయించగా ఒక్కొక్కటి 50 టన్నులకు మించి ఉన్నాయి. దీంతో ఓవర్ లోడ్ గా గుర్తించి బోనకల్​ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

అక్రమ రవాణాను అరికట్టాలి...

జిల్లాలో అధికార పార్టీ నేతల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీన్ని అరికట్టాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఓవర్​స్పీడ్ తో ఇసుక లారీలతో గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తూ, రోడ్లను కూడా డ్యామేజ్​చేస్తున్నారు. అడ్డుకున్న గ్రామస్తులను కూడా బెదిరిస్తున్నారు. ఇసుక రవాణాపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అడ్డుకోవాలి. 
–కొండపల్లి శ్రీధర్​రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు

మూడు లారీలను సీజ్​ చేశాం..

బుధవారం రాత్రి ఓవర్​లోడ్ తో వస్తున్నాయని మూడు ఇసుక లారీలను సీజ్ చేశాం. వాటికి అనుమతి ఉందా లేదా తేల్చాలని మైనింగ్ డిపార్ట్ మెంట్ అధికారులకు లెటర్ రాశాం. వారి నుంచి రిప్లై వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం.
– తోట కిషన్ రావు, జిల్లా ట్రాన్స్​పోర్ట్ ఆఫీసర్, ఖమ్మం