
- భైంసా వ్యవసాయ మార్కెట్లో ఘటన
- చర్యలు తీసుకోవాలని రైతుల ఆందోళన
- 2 గంటల పాటు నిలిచిన కొనుగోళ్లు
- అధికారుల హామీతో విరమణ
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసాలోని గాంధీ గంజ్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఓ రైతుపై హమాలీలు దాడి చేయడం కలకలం రేపింది. దీంతో రెండు గంటల పాటు కొనుగోళ్లు నిలిచిపోయాయి. లోకేశ్వరం మండలం వట్టోలి గ్రామానికి చెందిన శ్రీనివాస్అనే రైతు సోయా అమ్మేందుకు మార్కెట్‌కు తీసుకువచ్చాడు. ధర మాట్లాడుకున్న తర్వాత హమాలీలు జల్లెడ పట్టే క్రమంలో కొంత సరుకు కింద పడింది.
దాన్ని శ్రీనివాస్ గోనె సంచుల్లో నింపుకుంటున్నాడు. హమాలీలు వచ్చి ఎందుకు నింపుతున్నావంటూ రైతుతో వాగ్వాదానికి దిగారు. తనకు తెలియక నింపుకుంటున్నానని చెప్పగా, ఈవిషయంలో ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో శ్రీనివాస్‌పై హమాలీలు ఖాళీ పీపా డబ్బాలతో దాడి చేయగా..తల, ముఖంపై గాయాలయ్యాయి. ఇది చూసిన ఖరీదుదారులు, మార్కెట్ఆఫీసర్లు, రైతులు ఆపారు.
దాడిని నిరసిస్తూ రైతులు పెద్ద సంఖ్యలో గంజ్గేటు ముందు మెయిన్‌రోడ్డుపై ఆందోళనకు దిగారు. టౌన్ సీఐ ఎల్.శ్రీను, ఎస్సై శ్రీకాంత్ అక్కడికి వచ్చి దాడి చేసిన హమాలీలను, ఖరీదుదారుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే దాడి చేసిన హమాలీలను తమకు అప్పగించేంతవరకు ఆందోళన విరమించేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. దీంతో రెండు గంటల పాటు కొనుగోళ్లు నిలిచిపోయాయి.
ఏఎంసీ వైస్ చైర్మన్ జేకే పటేల్, సెక్రెటరీ శ్రీనివాస్, సీఐ రైతులను సముదాయించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మార్కెట్ఆఫీసర్లు, పాలకవర్గంతో వాగ్వాదానికి దిగారు. హమాలీల ఆగడాలు మితిమీరుతున్నాయని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా..యాక్షన్ తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. తర్వాత గాయపడిన రైతు శ్రీనివాస్‌ను దవాఖానకు తరలించారు.