అబ్బాయిలు జాగ్రత్తా : అందమైన అమ్మాయిలతో యువకులకు వల

అబ్బాయిలు జాగ్రత్తా : అందమైన అమ్మాయిలతో యువకులకు వల
  •  డేటింగ్ యాప్​లు వేదికగా మోసం
  • పబ్​లకు పిలిపించి అధిక బిల్లులతో దోపిడీ
  • దాదాపు 60 మంది నుంచి రూ.25 లక్షలు వసూలు  
  • ఢిల్లీకి చెందిన ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు 
  • హైదరాబాద్​లోని మోష్ పబ్ నిర్వాహకులు ముగ్గురు కూడా..  
  • ఢిల్లీ, బెంగళూర్​లోనూ ఇదే తరహాలో మోసాలు 

గచ్చిబౌలి, వెలుగు: డేటింగ్ యాప్​లలో యువకులకు వల వేసి మోసా లకు పాల్పడుతున్న ఢిల్లీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిల ద్వారా యువకులను ఆకర్షించి, పబ్​లకు రప్పించి అధిక బిల్లులతో దోపిడీకి పాల్పడుతున్న ఈ గ్యాంగ్ ఆటకట్టించారు. ముఠాలోని ఆరుగురు సభ్యులతో పాటు హైదరాబాద్​లోని మోష్ పబ్ నిర్వాహకులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ కేసు వివరాలను బుధవారం గచ్చిబౌలిలోని తన ఆఫీసులో మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలోని విశ్వాస్​నగర్​కు చెందిన ఆకాశ్ కుమార్ (27), సూరజ్ కుమార్(23) అక్కడ డెవిల్స్ నైట్ క్లబ్ నిర్వహించారు. క్లబ్​కు కస్టమర్లు రావడం కోసం అందమైన అమ్మాయిలతో డేటింగ్ యాప్స్ ద్వారా యువకులకు వల వేసేవారు. తర్వాత ఆ యువకులను పబ్​కు రప్పించి అధిక బిల్లులు వసూలు వేసి దోపిడీ చేసేవారు. ఈ క్రమంలో ఢిల్లీకే చెందిన అక్షంత్ నారుళ్ల(23), తరుణ్(30), శివరాజ్ నాయక్ (27), రోహిత్ కుమార్(19)తో కలిసి ఆకాశ్, సూరజ్ ముఠాగా ఏర్పడ్డారు. తర్వాత బెంగళూరుకు మకాం మార్చి.. అక్కడ నష్టాల్లో ఉన్న పబ్​ను సంప్రదించి మోసాలకు పాల్పడ్డారు. 

వీళ్ల కోసమే స్పెషల్ మెనూ.. 

ట్రాప్ చేసిన యువకుల నుంచి భారీగా వసూలు చేసేందుకు అధిక రేట్లతో కూడిన స్పెషల్ మెనూ కార్డును తయారు చేశారు. యువకులను మోష్ పబ్​కు తీసుకొచ్చిన అమ్మాయిలు ఖరీదైన మద్యం ఆర్డర్ ఇచ్చేవారు. తీరా బిల్లు కట్టే సమయానికి ఆ అమ్మాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత పబ్ నిర్వాహకులు యువకుల చేతిలో బిల్లు పెట్టి, భారీగా వసూలు చేసేవారు.

 ఇలా నగరానికి చెందిన దాదాపు 50 నుంచి 60 మంది యువకులను ట్రాప్ చేశారు. ఒక్కో యువకుడి వద్ద రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేశారు. ఈ ముఠా ముఖ్యంగా వీకెండ్స్​లో సాఫ్ట్​వేర్ ఉద్యోగులే లక్ష్యంగా తమ ప్లాన్ అమలు చేసింది. పరువు పోతుందన్న భయంతో మోసపోయిన యువకులెవరూ బయట ఎక్కడా చెప్పలేదు. 

సోషల్ మీడియాలో పోస్టుతో.. 

ఈ ముఠా ఏప్రిల్ 17 నుంచి జూన్ 1 మధ్య దాదాపు 60 మంది నుంచి రూ.25 లక్షలు దోచుకుంది. ఇందులో పబ్​కు రూ.16 లక్షలు చెల్లించి, మిగిలిన డబ్బులు ముఠా సభ్యులు పంచుకున్నారు. కొన్ని రోజుల కింద ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి సైతం ఇదే విధంగా మోసపోయి మోష్ పబ్​లో రూ.40 వేల బిల్లు చెల్లించాడు. అనంతరం తాను మోసపోయానని గ్రహించిన అతడు.. దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనిపై మాదాపూర్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదంతా ఢిల్లీకి చెందిన డెవిల్స్ నైట్ క్లబ్ ముఠా పని అని గుర్తించారు.

 హైదరాబాద్ లో తమ ప్లాన్ సక్సెస్ చేసుకుని, నాగపూర్​లో పని మొదలు పెట్టేందుకు రెడీ అయిన ఆ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. అలాగే, మోష్ పబ్ మేనేజర్ సాయికుమార్, ఓనర్లు తరుణ్, జగదీవ్​లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.40 లక్షల విలువైన రెండు కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

మోష్ పబ్ కేంద్రంగా.. 

మొదట ఢిల్లీ, బెంగళూరులో మోసాలకు పాల్పడిన ముఠా.. ఆ తర్వాత హైదరాబాద్​పై కన్నేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న హైదరాబాద్​కు వచ్చిన ఈ ముఠా.. ఉద్యోగం పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు యువతులను నగరానికి రప్పించి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మకాం వేసింది. అనంతరం నష్టాల్లో ఉన్న పబ్ కోసం గాలించి, మాదాపూర్​లోని మోష్ పబ్​ను ఎంపిక చేసుకుంది. మోష్ పబ్ మేనేజర్ చెరుకుపల్లి సాయికుమార్(32)ను సంప్రదించి తమ పథకాన్ని వివరించింది. వచ్చిన లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది.

 పథకంలో భాగంగా ఈ ముఠాకు చెందిన సభ్యులు ఈవెంట్ మేనేజర్లు, క్యాషియర్, బౌన్సర్, వెయిటర్లుగా పబ్​లో చేరారు. టిండర్, బంబుల్, హింజ్ వంటి డేటింగ్ యాప్స్​లో తమ దగ్గురున్న అమ్మాయిల ఫొటోలతో అకౌంట్లు క్రియేట్ చేశారు. అలా వివిధ యాప్స్​లో యువకులకు వల వేసేవారు. తర్వాత కలుద్దామంటూ హైటెక్ సిటీకి రప్పించేవారు. అలా వచ్చిన యువకులను ముఠాలోని అమ్మాయిలు కలిసేవారు. ప్లాన్​లో భాగంగా వాళ్లను మోష్ పబ్​కు తీసుకొచ్చేవారు.