ఎన్‌హెచ్‌లపై కనిపించని ట్రామా కేర్‌ సెంటర్లు

ఎన్‌హెచ్‌లపై కనిపించని ట్రామా కేర్‌ సెంటర్లు
  • రాష్ట్రంలో 55 చోట్ల ఏర్పాటుకు గతంలో కసరత్తు చేసిన ప్రభుత్వం 
  • ఆ తరవాత మరుగున పడిన అంశం 
  • అత్యవసర వైద్యం అందక గాలిలో కలుస్తున్న ప్రాణాలు 

హనుమకొండ, వెలుగు : జాతీయ రహదారులపై ప్రతిఏటా యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. ప్రమాదాల్లో గాయపడిన వారికి సరైన టైంలో ట్రీట్మెంట్​ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. గోల్డెన్‌ అవర్‌లో ట్రీట్‌మెంట్‌ అందితే ప్రాణాలు దక్కే ఛాన్స్‌ ఉన్నప్పటికీ హైవేలపై ఎక్కడా ఆ సదుపాయం లేదు. దీంతో హైవేలపై యాక్సిడెంట్లు జరిగిన టైంలో ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలించేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. 

కనిపించని ట్రామాకేర్​ సెంటర్లు

ప్రమాద బాధితులకు అత్యవసర వైద్యం అందించేందుకు గతంలో రాష్ట్రంలోని వివిధ నేషనల్​ హైవేలపై 55 చోట్లా ట్రామా కేర్​ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. కానీ ఆ తరువాత ట్రామా కేర్​ సెంటర్ల ఏర్పాటు విషయం కార్యరూపం దాల్చకుండానే తెరమరుగైంది. దీంతో రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందక ఏటా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 

పెరుగుతున్న ప్రమాదాలు

ఎన్​ హెచ్, స్టేట్​ రోడ్లపై ఇంజినీరింగ్ లోపాలు, భారీ వాహనాల అతివేగం, డ్రంక్​ అండ్​ డ్రైవ్​, వాహనదారుల సెల్ఫ్​ మిస్టేక్స్​, తదితర కారణాలతో   యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. గతేడాది రాష్ట్రంలో మొత్తంగా 21 వేల వరకు రోడ్డు ప్రమాదాలు జరగగా.. ఆయా యాక్సిడెంట్లలో దాదాపు 6,800 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అందులో చాలావరకు అత్యవసర వైద్యం అందక చనిపోయిన వారే ఎక్కువున్నారు.  అంతకుముందు సంవత్సరం ఓవరాల్ గా 19,497 రోడ్డు యాక్సిడెండ్లు జరగగా.. 6,886 మంది ప్రాణాలు కోల్పోయి, 18 మందికిపైగా గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. ఇలా ఏటికేడు రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం కలవరానికి గురి చేస్తోంది.
 
55 చోట్లా ట్రామాకేర్​ సెంటర్లు 

నేషనల్ హైవేలపై ప్రమాదాలు, మరణాల దృష్ట్యా గత ఏప్రిల్​ నెలలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లోని జాతీయ రహదారులపై  ట్రామా కేర్​ సెంటర్లు పెట్టాలని  నిర్ణయించింది.    తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ ఇనిషియేషన్​ పేరున ట్రామా కేర్​ సెంటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్​ లో వీటిని ఏర్పాటు చేసేందుకు అప్పట్లో హడావుడి చేసింది. 

ALSO READ : కొడంగల్​పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్​

ఈ మేరకు ఒక్కో సెంటర్​ ను రూ.75 లక్షలతో డెవలప్​ చేయాలని నిర్ణయించారు. కానీ వాటి ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నామనే విషయం కూడా ప్రకటించకుండా.. అప్పట్లో ట్రామా కేర్​ సెంటర్ల పేరున హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తరువాత ఆ విషయాన్ని మూలన పెట్టేసింది. దీంతో జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగిన సమయంలో అత్యవసర వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. 

మేడారం రూట్​ లో ఇలా.. 

  రాష్ట్రంలో హైవేలపై ఉన్న మండల కేంద్రాల్లో చాలాచోట్లా పీహెచ్​ సీలు అందుబాటులో ఉన్నా రాత్రయితే వాటి సేవలు బంద్​ అవుతున్నాయి. 24 గంటల ఆసుపత్రులుగా అప్​ గ్రేడ్​ చేసినా అక్కడ సరిపడా సిబ్బంది లేక, ఉన్నచోట సిబ్బంది అందుబాటులో ఉండక జనాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  

తరచూ ప్రమాదాలు

ఉమ్మడి వరంగల్​ జిల్లా పరిధిలోని నేషనల్​ హైవే–163 పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే మార్గంలోని మేడారం మహాజాతర కూడా మరో నాలుగు రోజుల్లోనే ప్రారంభం కానుండగా.. లక్షలాది వెహికిల్స్​ రాకపోకలు సాగిస్తుంటాయి. కాగా హనుమకొండ జిల్లా దాటిన తరువాత ములుగు జిల్లా కేంద్రం వెళ్లే వరకు ఎక్కడా చెప్పుకోదగ్గ ఆసుపత్రి లేదు. 

దీంతోనే ఈ మార్గంలో ఎక్కడైనా యాక్సిడెంట్​ జరిగితే.. వరంగల్ ఎంజీఎం నుంచో, లేదా ములుగు ఏరియా ఆసుపత్రికో పేషెంట్లను తరలించాల్సి వస్తోంది. వరంగల్ ఎంజీఎం నుంచి ములుగు వరకు 50 కిలోమీటర్లకుపైగానే దూరం ఉండగా.. ఎంజీఎం నుంచో, ములుగు ఆసుపత్రి నుంచో అంబులెన్స్​ వెళ్లి, పేషెంట్లను తీసుకొచ్చి అడ్మిట్​ చేయడానికే తక్కువలో తక్కువ గంట సమయమైనా పడుతోంది. 

ఇంతలో బాధితుల పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ములుగు, వరంగల్ కు సరిగ్గా మధ్యలో నేషనల్​ హైవేపై ఉన్న ఆత్మకూరు మండలకేంద్రంలో పీహెచ్​సీ ఉండగా.. దానిని గతంలోనే 24 గంటల ఆసుపత్రిగా అప్​ గ్రేడ్​ చేశారు. కానీ అందులో సిబ్బంది సరిగ్గా ఉండక అది కాస్త నామమాత్రంగానే పని చేస్తోంది. కాగా నేషనల్​ హైవేపై జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఇటు వరంగల్, అటు ములుగుకు సెంటర్​ గా పాయింట్​ గా ఉన్న ఆత్మకూరు ఆసుపత్రిని ట్రామా కేర్​ సెంటర్​ గా డెవలప్​ చేయాలనే డిమాండ్​ ఎప్పటినుంచో ఉంది. ఇక్కడ ట్రామా కేర్​ సెంటర్​ ఏర్పాటు చేస్తే ఎంతోమంది పునర్జన్మ దక్కే అవకాశం కూడా లేకపోలేదు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ట్రామా కేర్​ సెంటర్లు ఏర్పాటు చేస్తేనే 

బెటర్ ట్రామా కేర్​ సెంటర్లు ప్రమాద బాధితులకు పునర్జన్మనిస్తాయి. ట్రామా కేర్​ సెంటర్​ ఏర్పాటైతే వాటిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో ప్రమాద బాధితులకు కీలకమైన మొదటి గంటలో మెరుగైన ట్రీట్మెంట్​ అందే అవకాశం ఉంటుంది.  ట్రామా కేర్​ సెంటర్లలో  అర్థోపెడిక్​, న్యూరోకు సంబంధించిన సర్జన్లు​, అనస్థీషియా డాక్టర్లు, ఇతర ఎమర్జెన్సీ సేవలందించే డాక్టర్లతో పాటు 24 గంటలపాటు అంబులెన్స్​, ఆక్సీజన్​ సౌకర్యంతో  ప్రమాద బాధితుల మరణాలు  తగ్గిపోయే ఛాన్స్​ ఉంటుంది. 

కాగా ఎన్​హెచ్​ నిబంధనల ప్రకారం గతంలో 50 నుంచి 100 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్​ సెంటర్​ ప్రతిపాదన ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నేషనల్​ హైవేలపై 25 కిలోమీటర్ల పరిధిలో ఒక సెంటర్​ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ట్రామా కేర్​ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కూడా కోరుతున్నారు.

మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు 

గతంలో ప్రభుత్వం ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు చేసింది. నేషనల్​ హైవేలపై ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ ఆ తరువాత మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. ట్రామా కేర్​ సెంటర్లు అందుబాటులోకి వస్తే ప్రమాద బాధితులకు మెరుగైన అత్యవసర వైద్యం అందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఎన్​హెచ్​–163పై ఉన్న ఆత్మకూరు ఆసుపత్రిని ట్రామా కేర్​ సెంటర్​గా డెవలప్​ చేసేందుకు ప్రతిపాదనలు పంపిస్తాం. 
డాక్టర్​ సాంబశివరావు, డీఎంహెచ్​వో, హనుమకొండ