![హైదరాబాద్– విజయవాడ హైవే పై...ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ](https://static.v6velugu.com/uploads/2025/02/travel-bus-in-theft-on-hyderabad-vijayawada-highway_bjMCT4Am3k.jpg)
- ప్యాసింజర్ రూ. 25 లక్షల నగదు బ్యాగు మాయం
- చెన్నై నుంచి వస్తున్న బస్సులో వస్తుండగా నల్గొండ జిల్లాలో ఘటన
నార్కట్ పల్లి,వెలుగు : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై హోటల్ వద్ద ఆగి ఉన్న ప్రైవేటు బస్సులో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. శనివారం రాత్రి 11 గంటలకు చెన్నై అన్నానగర్ నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సులో వెంకటేశ్వర్లు నగదు బ్యాగుతో ఎక్కి హైదరాబాద్ కు వెళ్తున్నాడు.
ఆదివారం ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా నార్కట్పల్లి టౌన్ శివారులోని పూజిత హోటల్ వద్ద బస్సు ఆగింది. వెంకటేశ్వర్లు టాయిలెట్ కోసం కిందకు దిగాడు. తిరిగి బస్సులోకి వెళ్లి చూసేసరికి రూ. 25 లక్షల నగదు బ్యాగు కనిపించడం లేదు. దీంతో వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నాగరాజు, ఎస్ఐ డి. క్రాంతికుమార్ తెలిపారు.
అయితే.. గతంలోనూ ఇదే హోటల్ వద్ద చెన్నై నుంచి వచ్చే ప్రైవేట్ బస్సుల్లోనే చోరీలు జరిగిన ఘటనలు ఉన్నాయి. చోరీ జరిగినప్పుడే బాధితులు, పోలీసులు హడావుడి చేస్తూ.. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. అయితే.. బ్లాక్ మనీ తరలింపులో ఏమైనా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా..? లేదంటే చోరీలు నిజంగానే జరుగుతున్నాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే హోటల్ వద్ద భారీ మొత్తంలో డబ్బు చోరీలు జరుగుతుండగా పోలీసులకు సవాలుగా మారుతున్నాయి.