సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్రాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కర్నాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఈ ఉచిత బస్సు పథకాన్ని మహిళలకు అమలు చేస్తుండగా రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ కూడా అమలుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలో పర్యావరణ కోణంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని సమీక్షించడం సముచితం.
భూతాపానికి ప్రధాన కారణం శిలాజ ఇంధనాలు మండించడం వల్ల విడుదలయ్యే కార్బన ఉద్గారాలు.. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, క్లోరో ఫ్లోరో కార్చన్లు, మీథేన్ వంటి వాయువులు. ఇందులో ప్రధాన పాత్ర కార్బన్ ఉద్గారాలదే. ఇవన్నీ కూడా ఆటోమొబైల్స్ ద్వారా పెట్రోలు, డీజిల్ మండించడం ద్వారా వచ్చేవి. ఇవి భూతాపానికి కారణమవుతాయి. చైనా, అమెరికా దేశాల తర్వాత భారతదేశం కార్బన్ ఉద్గార విడుదల్లో మూడో స్థానంలో ఉంది.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రోత్సహించాలి
ఐక్యరాజ్యసమితి విడుదల చేసే వాతావరణ కార్యాచరణ నివేదిక ప్రకారం.. బస్సులు, రైళ్లు వంటి సామూహిక రవాణా సదుపాయాలలో ప్రయాణించడం ద్వారా వాతావరణ మార్పులకు, భూమండలం వేడెక్కడానికి కారణమయ్యే వాయువులను మూడింట రెండు వంతులు తగ్గించవచ్చు. భూ ఉష్ణోగ్రతలను రానున్న కాలంలో 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు పరిమితం చేయడానికి కావాల్సిన లక్ష్యసాధనకు కూడా ఉపయోగపడుతుంది. కొవిడ్ 19 తదనంతర పరిణామాల వల్ల సామూహిక రవాణా సదుపాయాల కంటే వ్యక్తిగత రవాణా సదుపాయాలను ఆశ్రయించడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఆర్థికంగా ప్రభుత్వాలకు భారంగా ఉన్నప్పటికీ పర్యావరణ, సామాజిక భద్రతలపరంగా చూస్తే చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే పర్యావరణానికి నష్టం కలిగించి ఓజోన్ పొరను పలుచన చేసే కార్బన్ ఉద్గారాలను తగ్గించే అవకాశముంది. ఐక్యరాజ్యసమితి వారి క్లైమేట్ యాక్షన్ ప్లాన్ గైడ్ ప్రకారం భూతాపానికి కారణమయ్యే కార్బన్ ఉద్గారాలను ప్రతి వ్యక్తిగత ఉద్గారాలు 2020 సంవత్సరం వరకు 6.3 టన్నులు ఉండగా దానిని 2030 సంవత్సరం వరకు 2.1 టన్నులకు తగ్గించాలని నిర్దేశిస్తుంది.
ద్వితీయ స్థాయి నగరాలకుస్థానిక మెట్రో రైల్వే వ్యవస్థను విస్తరించాలి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు ఉచిత ప్రయాణాన్ని, సామూహిక ప్రయాణ సదుపాయాలను ప్రోత్సహిస్తున్నాయి. కెనడాలోని చాంబిలి, ఇస్తోనియాలోని టాలిన్, స్వీడన్ లోని అవేస్తా, ఇంగ్లాండ్‌లోని డ్యూస్ బరి, ఆస్ట్రేలియాలోని పెర్త్, అమెరికాలోని క్లేమ్సన్, బల్గేరియాలోని సాముకోవ్, ఫిన్లాండ్లోని మేరీ హోమ్ తదితర నగరాల్లో ఉచితంగా సామూహిక ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపు దాల్చాలన్న భారతదేశ ఆకాంక్షకు అధిక జనాభా అడ్డుకారాదు. అధిక జనాభా వల్ల ప్రపంచ కార్బన్ ఉద్గారాలను అధిక మొత్తంలోనే మనం విడుదల చేస్తున్నాం. కాబట్టి, సామూహిక రవాణా సదుపాయాలను ప్రోత్సహించడం మంచిది. మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన స్థానిక మెట్రో రైల్వే వ్యవస్థను ద్వితీయ స్థాయి నగరాలకు కూడా విస్తరించాలి. సాధ్యమైనంత ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులను పెంచాలి. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించినట్లుగానే ఇతరులకు కూడా ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా సామూహిక రవాణాను పెంచాలి.
సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహించి సైకిల్ ట్రాక్ వ్యవస్థను నగరాల్లో నెలకొల్పాలి. వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ప్రకారం వ్యక్తిగత వాహనాల కంటే సామూహిక వాహనాలైన బస్సులు, రైళ్లు మూడింట రెండు వంతుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తున్నాయని తెలుస్తోంది. కార్బన్ ఉద్గారాలను రానున్న కాలంలో గణనీయంగా తగ్గించినప్పుడే భూతాపం నుంచి మానవ మనుగడను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
– డా. ఎలగొండ నరసింహమూర్తి, శాతవాహన యూనివర్సిటీ-