గత ఏడాదిన్నర కాలంగా టీ20 నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన భారత స్టార్ బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో అతను రెండో స్థానానికి పడిపోయాడు. భారత్‌పై అర్ధశతకం బాది సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంకును అధిరోహించాడు.
ఐసీసీ ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం.. 844 రేటింగ్ పాయింట్లతో హెడ్ మొదటి స్థానంలో ఉండగా.. 842 రేటింగ్ పాయింట్లతో సూర్య రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం 2 పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉండటం గమనార్హం. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో హెడ్ మొత్తం 7 మ్యాచ్‌ల్లో 158.38 స్ట్రైక్‌రేట్, 42.50 సగటుతో 255 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనే అతనికి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. ఇక సూర్య మొదట్లో సత్తా చాటకపోయినా, ఆ తర్వాత పుంజుకున్నాడు. ఇప్పటివరకూ 6 ఇన్నింగ్స్‌లలో 139.25 స్ట్రైక్‌రేట్, 29.80 సగటుతో 149 పరుగులు చేశాడు. తదుపరి ఇంగ్లాండ్‌తో జరిగే సెమీ ఫైనల్లో బ్యాట్ ఝుళిపిస్తే, మళ్లీ టాప్ ర్యాంకుకు చేరుకుంటాడు.
ఈ జాబితాలో వీరిద్దరి తరువాత ఫిల్ సాల్ట్ (816 రేటింగ్ పాయింట్లు), బాబర్ ఆజం (755 రేటింగ్ పాయింట్లు), మహ్మద్ రిజ్వాన్ (746 రేటింగ్ పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగవుతున్నారు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ టాప్ 5 బ్యాటర్లు
- 1. ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా): 844 పాయింట్లు
- 2. సూర్యకుమార్ యాదవ్(ఇండియా): 842 పాయింట్లు
- 3. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్): 816 పాయింట్లు
- 4. బాబర్ ఆజం(పాకిస్తాన్): 755 పాయింట్లు
- 5. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్): 746 పాయింట్లు
ఇక టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో వనిందు హసరంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
Travis Head dethrones Suryakumar Yadav as the No.1 T20I batter 🥇🚀 pic.twitter.com/s9NeBB153k
— Sport360° (@Sport360) June 26, 2024