- ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి బలవంతంగా వసూళ్లు
- వీఆర్‌ఏకు ఐడీలు ఇవ్వాలంటే డబ్బులివ్వాల్సిందే
- అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి.. బాధితులు
వికారాబాద్, వెలుగు : జిల్లాలోని ట్రెజరీ ఆఫీసుల్లో వసూళ్ల దందాకు అడ్డే లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర అలవెన్స్‌లను ట్రెజరీ ఆఫీసుల నుంచే బ్యాంకుల అకౌంట్లకు పంపుతారు. అదే విధంగా కాంట్రాక్టర్ల బిల్లులు కూడా ట్రెజరీ ద్వారానే జరుగుతాయి. బిల్లులు కావాలంటే ట్రెజరీ అధికారులకు ముడుపులు చెల్లిస్తేనే బిల్లులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రెజరీలో బిల్లులకు వసూళ్ల దందా కొంతకాలంగా నడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. తాజాగా వసూళ్ల దందా మరోసారి బట్టబయలైంది. గత ప్రభుత్వం వీఆర్‌ఏలను తొలగించి, వివిధ శాఖల్లోకి బదిలీ చేసినది తెలిసిందే. కొంతకాలంగా వీఆర్‌ఏలను వివిధ శాఖల్లో కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి ఐడీలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వారికి ఐడీలు ప్రభుత్వ గుర్తింపు కార్డు, పాన్ నెంబర్లు జిల్లా ట్రెజరరీ ఆఫీసునే అందజేస్తుంది. ఇందుకు జిల్లాలో సుమారు 600 మంది ఉద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 వేల నుంచి రూ 3. వేల దాకా వసూళ్లు చేస్తున్నారని వీఆర్‌ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజులుగా వీఆర్‌ఏలు ధర్నాలు, నిరసనలు తెలిపి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి విజయం సాధించారు. కానీ ట్రెజరరీ ఆఫీసుల్లో మాత్రం చేతులు తడపనిదే ఫైల్స్ ముందుకు కదలడం లేదనే వీఆర్‌ఏలు ఆరోపిస్తున్నారు.
ఆరు నెలల జీతాలు రావాల్సి ఉండగా..
వీఆర్ఏలకు సుమారు 6 నెలల పెండింగ్ జీతాలు రావాల్సి ఉంది. జీతాలు విడుదలకు కూడా ట్రెజరరీ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టరేట్ లో ఆవరణలో ఉన్న అధికారులు చేతివాటం ప్రదర్శించడం గమనార్హం. కలెక్టర్ ఆఫీసులోనే అధికారులు చేతివాటం చూపుతుండడం గమనార్హం. ఇది జిల్లా అడిషనల్ కలెక్టర్ దృష్టికి వెళ్లిందని సమాచారం. డబ్బులు డిమాండ్ చేసే అధికారులపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్ది చర్యలు తీసుకోవాలని వీఆర్‌ఏలు కోరుతున్నారు.