- చిన్న చిన్న పట్టణాల్లోనూ విస్తరిస్తున్న కార్పొరేట్ దందా
- టౌన్లలో పేరొందిన హాస్పిటల్స్‌తో డీల్ కుదుర్చుకుంటున్న వైనం
- ఒప్పుకుంటే విలీనం.. లేదంటే అద్దె ప్రాతిపదికన అగ్రిమెంట్
నల్గొండ, వెలుగు : ఇప్పటివరకు హైదరాబాద్ నగరానికి పరిమితమైన కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ ఇప్పుడు టు టైర్, త్రీ టైర్ సిటీలకు సైతం పాకింది. కార్పొరేట్ బ్రాండ్ పేరుతో హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్న యాజమాన్యాలు ట్రీట్‌మెంట్ మాత్రం లోకల్ డాక్టర్లతోనే చేయిస్తున్నారు. కార్పొరేట్ డాక్టర్లతో ట్రీట్‌మెంట్ చేయించుకుందామని నమ్మి వస్తున్న పేషెంట్లు తీరా లోకల్ డాక్టర్లను చూసి నివ్వెరపోతున్నారు.
పైకి ఫుల్ హంగామా... లోపల అంతా డొల్ల
తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల్లో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ మెల్లమెల్లగా జిల్లాలకు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా కన్ను, చెవి, ముక్కు సంబంధిత స్పెషలిస్టులతో కార్పొరేట్ వైద్యాన్ని ప్రజల దగ్గరికే తీసుకొస్తున్నామని, తమ హాస్పిటల్స్‌లో పెద్ద పెద్ద డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తారంటూ ప్రచారాన్ని ఊదరగొడుతున్నారు. పేషెంట్లు, జనాలను ఆకట్టుకునేలా పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నమ్మి కార్పొరేట్ హాస్పిటల్స్‌కు వెళ్లిన పేషెంట్లకు అక్కడ లోకల్ డాక్టర్లే కనిపించడంతో షాక్‌కు గురవుతున్నారు. పేరుకు పెద్ద హాస్పిటల్స్ అయినా లోపల మొత్తం డొల్లగానే కనిపిస్తోంది. నల్గొండలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ బ్రాంచ్‌లో పనిచేసే అద్దె డాక్టర్‌కు, హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌కు ఇటీవల గొడవ జరిగింది. దీంతో ఆ డాక్టర్ చెప్పాపెట్టకుండా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. మరో వైపు గ్రామాల్లోని పేషెంట్లను తమ వైపు రప్పించుకునేందుకు ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకోవడమే కాకుండా, పలువురు ఆర్‌ఎంపీతో డీల్ మాట్లాడుకుంటున్నారు. ఇందుకోసం వారికి 30 నుంచి 40 శాతం కమీషన్ సైతం ఇస్తున్నారు.
ఒప్పుకుంటే విలీనం.. లేదంటే హైరింగ్ విధానం
వైద్య వృత్తిలో 30, 40 ఏండ్ల అనుభవం ఉన్న డాక్టర్లకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎర వేస్తున్నాయి. వీళ్లలో చాలా మంది కంటి, చెవి డాక్టర్లతో పాటు ఎండీ స్థాయి కలిగిన వారు, కిడ్నీ, గుండె స్పెషలిస్ట్‌లు ఉంటున్నారు. డీల్ కుదిరితే సీనియర్ డాక్టర్లకు చెందిన హాస్పిటల్స్‌ను లీజ్‌కు తీసుకోవడం, లేదంటే ఆ హాస్పిటల్‌ను తమ కార్పొరేట్ హాస్పిటల్ నెట్‌వర్క్‌లో విలీనం చేయాలని ప్రపోజల్ పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల నయాపైసా పెట్టుబడి లేకుండానే నెలకు లక్షల్లో ఆదాయం చూపిస్తామని ఆఫర్ చేస్తున్నారు. అందుకు కూడా ఒప్పుకోకపోతే హైరింగ్ పద్ధతిలో అగ్రిమెంట్ చేసుకొని నెలకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు చెల్లిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. అయితే కార్పొరేట్ హాస్పిటల్స్‌తో చేతులు కలిపితే వాళ్ల కనుసన్నల్లోనే పనిచేయాల్సి వస్తుందని, ఇన్‌కం కోసం పేషెంట్లను మోసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు సీనియర్ డాక్టర్లు ఈ ప్రపోజల్స్‌ను రిజక్ట్ చేస్తున్నారు. అయితే యువ డాక్టర్లు మాత్రం కార్పొరేట్ హాస్పిటల్స్ ఆఫర్ల పట్ల ఆసక్తి చూపుతున్నారు. గత రెండు, మూడేండ్లలో పట్టణాల్లో యువ డాక్టర్లు భారీ సంఖ్యలో పెరిగారు. స్పెషలిస్ట్‌లు అందరూ సిండికేట్‌గా మారి, కార్పొరేట్ స్థాయిలో భారీ అంతస్తులతో హాస్పిటల్స్ నిర్మించారు. ఇప్పుడు వీరికి పోటీగా కార్పొరేట్ హాస్పిటళ్ల బ్రాంచ్‌లు ఓపెన్ అవుతుండడంతో వైద్యం పేరిట దందా ఎక్కువ అవుతుందని సీనియర్ డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.
చెన్నై కేంద్రంగా పేరొందిన ఓ కార్పొరేట్ కంటి ఆస్పత్రి బ్రాంచ్ ఇటీవల నల్గొండలో ఓపెన్ అయింది. దీనికి ముందు నల్గొండలో పేరొందిన ఓ ప్రైవేట్ కంటి హాస్పిటల్‌తో డీల్ మాట్లాడారు. సదరు హాస్పిటల్‌ను కార్పొరేట్ హాస్పిటల్ గ్రూప్‌లో విలీనం చేయాలన్న ప్రపోజల్ పెట్టారు. అందుకు ఆ డాక్టర్ ఒప్పుకోకపోవడంతో కనీసం తమ బ్రాంచ్‌లో అయినా ట్రీట్‌మెంట్ చేయాలని, ఇందుకు నెలకు రూ.50 వేలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అయినప్పటికీ ఆ డాక్టర్ససేమిరా అనడంతో మరో కంటి డాక్టర్‌తో ఒప్పందం చేసుకున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన ఓ డెంటల్ హాస్పిటల్ గ్రూప్ సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌లో ఇటీవల ఓ బ్రాంచ్ ఓపెన్ చేసింది. గుంటూరు జిల్లాలో అనేక చోట్ల ఈ బ్రాంచ్‌లు నడుస్తుండగా, నొప్పి లేకుండా డెంటల్ ట్రీట్‌మెంట్ చేస్తామని ప్రచారం చేశారు. కానీ ఇక్కడ ట్రీట్‌మెంట్ చేసేది లోకల్ డాక్టర్లే కావడంతో పేషెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.